ఓటర్ల జాబితాలో 'ఏఐ' తప్పులు.. సీఈసీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఐదో సారి లేఖ

by Ramesh Naini |

2002 నాటి ఓటర్ల జాబితాను 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) సాయంతో డిజిటలైజేషన్ చేసే క్రమంలో తీవ్రమైన తప్పులు దొర్లాయని మమత ఆరోపించారు. దీనివల్ల అర్హులైన ఓటర్ల వివరాల్లో డేటా మిస్‌మ్యాచ్‌ ఏర్పడిందన్నారు.

ఓటర్ల జాబితాలో ఏఐ తప్పులు.. సీఈసీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఐదో సారి లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్రంలో చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు ఆమె సోమవారం లేఖ రాశారు. SIR ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మమతా బెనర్జీ సీఈసీకి ఐదో లేఖ ఇది కావడం విశేషం.

ఏఐ సాంకేతికతతో గందరగోళం

2002 నాటి ఓటర్ల జాబితాను 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) సాయంతో డిజిటలైజేషన్ చేసే క్రమంలో తీవ్రమైన తప్పులు దొర్లాయని మమత ఆరోపించారు. దీనివల్ల అర్హులైన ఓటర్ల వివరాల్లో డేటా మిస్‌మ్యాచ్‌ ఏర్పడిందని, వారిని 'లాజికల్ డిస్క్రిపెన్సీస్' (సాంకేతిక లోపాలు) ఉన్నవారిగా తప్పుగా వర్గీకరించారని ఆమె పేర్కొన్నారు.

గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాలా?

గత రెండు దశాబ్దాలుగా అనుసరిస్తున్న చట్టబద్ధమైన ప్రక్రియలను ఎన్నికల సంఘం విస్మరిస్తోందని మమత మండిపడ్డారు. గతంలో 'క్వాసీ-జుడీషియల్' విచారణల ద్వారా సరిచేసిన వివరాలను పక్కనబెట్టి, ఓటర్లు తమ గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాలని ఒత్తిడి చేయడం ఏకపక్షమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ ప్రక్రియ పూర్తిగా యాంత్రికంగా, కేవలం సాంకేతిక ఆధారంగా సాగుతోందని, ఇందులో మానవీయ కోణం లోపించిందని విమర్శించారు. SIR ప్రక్రియలో ప్రజలు సమర్పిస్తున్న పత్రాలకు సరైన రశీదులు (Acknowledgement) కూడా ఇవ్వడం లేదని మమత పేర్కొన్నారు.

కాగా, ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని, ఓటర్ల జాబితాను ఆయుధంగా వాడుకుంటోందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) గత కొంతకాలంగా ఆరోపిస్తోంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నుంచి మొదలైన విచారణలకు దాదాపు 25 లక్షల మంది ఓటర్లను పిలిచారు. 2002 ఓటర్ల జాబితాతో లింక్ కాని సుమారు 32 లక్షల మంది 'అన్‌మ్యాప్డ్' ఓటర్ల విచారణను ఈసీ ప్రస్తుతం చేపడుతోంది. సాంకేతిక లోపాలు ఉన్న ఓటర్ల విచారణ బుధవారం (జనవరి 14) నుంచి ప్రారంభం కానుంది.

Next Story