- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రదాడి వెనుక దేశాన్ని చీల్చే కుట్ర!
పహల్గాం ఉగ్రదాడి వెనుక భారతదేశాన్ని చీల్చే కుట్ర ఉండొచ్చని అనుమానిస్తున్న నిఘావర్గాలు..

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశంలో మతకల్లోలాలు సృష్టించడమే ఉగ్రవాదుల లక్ష్యంగా తెలుస్తున్నది. దాడి కశ్మీర్ లో జరిగినా.. దాని ప్రకంపనలు దేశవ్యాప్తంగా ఉండాలన్నదే ఉగ్రవాదుల అసలు లక్ష్యం కావొచ్చునని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులు ఐడీ కార్డులు చూసి, మతం ఏదని అడిగి మరీ టూరిస్టులను కాల్చి చంపడం వెనుక లక్ష్యం చాలా తీవ్రమైనదిగా భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మత కలహాలు రెచ్చగొట్టేలా చేయడం.. తద్వారా భారత్ లో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. టూరిస్టులు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వస్తారు కాబట్టి.. వాళ్లనే లక్ష్యంగా చేసుకుని ఉంటారని భావిస్తుంటారు. గతంలో కశ్మీర్, పంజాబ్ సహా అనేక ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగినా.. తాజా ఘటన వెనుక చాలా సుదీర్ఘ లక్ష్యాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. కశ్మీరీలకు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకరంగంపైనే కాబట్టి.. టూరిస్టులపై దాడి చేస్తే, స్థానికులనుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అయినా, దాడికి సిద్ధం అయ్యారంటే వాళ్ల లక్ష్యం సుదీర్ఘమైనదే అయి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
పాక్ ఆర్మీ చీఫ్ ఏమన్నారు?
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. విదేశాల్లో ఉంటున్న పాక్ జాతీయులతో ఆయన సమావేశమై.. భారత్‌లోని హిందువులు మరియు పాకిస్తాన్‌లోని ముస్లింలు రెండు వేర్వేరు జాతులని, వారి మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు పూర్తిగా భిన్నమని అన్నారు. టూ-నేషన్ సిద్ధాంతమే పాకిస్తాన్ సృష్టికి పునాది అని, ఈ కథను పాకిస్తానీలు తమ పిల్లలకు చెప్పాలని కోరుతూ భారత్ పై విద్వేషం కుమ్మరించాడు. కశ్మీర్ కోసం భారత్‌తో మూడు యుద్ధాలు జరిగాయని, అవసరమైతే మరో పది యుద్ధాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పుల్వామా దాడి సమయంలో ఐఎస్ఐ చీఫ్ గా ఉన్న ఆసిమ్ పై అప్పుడుకూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ గా ఉండటంతో ఘటన వెనుక అతడి హస్తం ఉండొచ్చని అనుమానాలు వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి, అంతకు కొద్ది రోజుల ముందు మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలకు కచ్చితంగా సంబంధం ఉంటుందని నిఘావర్గాలు భావిస్తున్నాయి.






