సుప్రీంకోర్టుకు చేరిన BC రిజర్వేషన్ల అంశం.. SLP దాఖలు చేసిన తెలంగాణ సర్కార్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-14 04:43:29  IST  )

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై తెలంగాణ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం‌కోర్టును ఆశ్రయించింది.

సుప్రీంకోర్టుకు చేరిన BC రిజర్వేషన్ల అంశం.. SLP దాఖలు చేసిన తెలంగాణ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ (BC) రిజర్వేషన్ల వ్యవహారంపై తెలంగాణ సర్కార్ (Telangana Government) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు (High Court) స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (Special Leave Petition) దాఖలు చేసింది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడమే తమ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

కాగా, బీసీ రిజర్వేషన్ల స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన ఆర్డర్ కాపీ అందిన వెంటనే కేబినెట్‌ మంత్రులు, న్యాయ నిపుణులతో సీఎం రేవంత్‌రెడ్డి లోతుగా చర్చించి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. అయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ రెండు, మూడు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవని సుప్రీంకోర్టు చెప్పిందన్న ప్రభుత్వం తరఫు లాయర్లు వాదిస్తున్నారు. ఇక పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశాలను కూడా స్పెషల్ లీవ్ పిటిషన్‌లో ఏజీ సుదర్శన్ రెడ్డి ప్రస్తావించినట్లుగా సమాచారం.

తెలంగాణ హైకోర్టు తీర్పు ఇలా..

తాము స్థానిక ఎన్నికల నిర్వహణలో ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేశామని కోర్టు తెలిపింది. ఈ అంశంలో వివాదాన్ని తేల్చేదాకా జీవో నెం.9తో పాటు పంచాయతీ రాజ్‌ చట్టం–2018లో రిజర్వేషన్‌లను మారుస్తూ జారీ చేసిన జీవో నంబర్‌ 41, 42పై కూడా స్టే విధించినట్లుగా ధర్మాసనం ప్రకటించింది. అయితే, తాము పూర్తి స్థాయిలో మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని, రిజర్వేషన్లు 50 శాతానికి మాత్రం మించొద్దని తెలిపింది. వికాస్‌ కిషన్‌రావ్‌ గవాలీ కేసులో సుప్రీం కోర్టు 50 రిజర్వేషన్లు మించకూడదని ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని హైకోర్టు కామెంట్ చేసింది. ఆ కేసును పరిగణలోకి తీసుకుని జీవో 9, 41, 42లను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ధర్మాసనం వెల్లడించింది.

Next Story