బెంగాల్ ఎన్నికల్లో రణరంగం.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి

by Malleboina Mahesh |

కుమార్‌గంజ్ బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్‌పై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణరక్షణ కోసం పొలాల్లోకి పరుగులు తీశారు.

బెంగాల్ ఎన్నికల్లో రణరంగం.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం ఉత్కంఠగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 50 శాతం పోలింగ్ నమోదు కావడంతో రికార్డు స్థాయి పోలింగ్ అవుతుందని ఎన్నికల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరోపక్క ఎన్నికల పోలింగ్ హింసాత్మకం గా మారింది. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని కుమార్‌గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్ (Subhendu Sarkar) పై అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి దిగారు. పోలింగ్ బూత్ నంబర్ 24 వద్ద ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన సుబేందుపై టీఎంసీ శ్రేణులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దుండగులు ఆయన ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు వాహనాన్ని ధ్వంసం చేయడంతో, సుబేందు సర్కార్ తన గన్‌మెన్‌తో కలిసి ప్రాణభయంతో సమీపంలోని పొలాల్లోకి పరుగులు తీశారు.

ఈ ఘటనపై సుబేందు సర్కార్ తీవ్రంగా స్పందిస్తూ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి భయంతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రం లోపల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ, బయట అరాచకం సాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆయన ఆరోపించారు. దీనిపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరోవైపు, బీజేపీ అభ్యర్థే ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని టీఎంసీ నేతలు ప్రత్యారోపణలు చేశారు. ఈ ఘటనతో కుమార్‌గంజ్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Next Story