గ్లోబల్ టెక్ సిటీస్ ర్యాంకింగ్స్.. టాప్ 30లో మన కూల్ సిటీ

by Naga Rani Yarlagadda |

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ టెక్ హబ్‌ల ర్యాంకింగ్‌లో బెంగళూరు నగరం 16వ స్థానానికి చేరుకుంది.

గ్లోబల్ టెక్ సిటీస్ ర్యాంకింగ్స్.. టాప్ 30లో మన కూల్ సిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ టెక్ హబ్‌ల ర్యాంకింగ్‌లో బెంగళూరు నగరం 16వ స్థానానికి చేరుకుంది. భారతదేశం నుంచి టాప్ 30లోకి అడుగుపెట్టిన మొదటి నగరంగా ఇది చరిత్ర సృష్టించింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ శావిల్స్ ఇండియా సోమవారం విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. ఆసియా మార్కెట్లపై ప్రపంచ దృష్టి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పురోగతి ఒక ముఖ్యమైన సంకేతమని నివేదికలో పేర్కొన్నారు.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరాలు తమ అగ్రస్థానాలను కాపాడుకుంటున్నప్పటికీ.. 'భారత సిలికాన్ వ్యాలీ'గా పిలువబడే బెంగళూరు తన ప్రతిష్ఠను మరింత పెంచుకుంటోంది. ఇక్కడ భారీ సంఖ్యలో నిపుణులు, బలమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థలు ఉండటం ఈ వృద్ధికి మూలాలుగా నిలుస్తున్నాయి. ఈ అంశంపై శావిల్స్ ఇండియా రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ నందన్ మాట్లాడుతూ .. "మంచి వ్యాపార అవకాశాలు, ఆకర్షణీయమైన జీవనశైలి, నైపుణ్యవంతులైన మానవ సంపద కలిగిన నగరాలు సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. బెంగళూరు తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంది" అని అన్నారు.

సింగపూర్, సియోల్ లాంటి ఆసియా నగరాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్, బయోటెక్నాలజీ రంగాల్లో ముందుకు సాగుతూ ఈ జాబితాలో మెరుగైన స్థానాలు సాధిస్తున్నాయి. బెంగళూరులో సాంకేతిక పరిశ్రమల విస్తరణతో ప్రీమియం కార్యాలయాలు, నివాస సముదాయాలకు గిరాకీ పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. వ్యాపార వాతావరణం, మానవ సంపద లభ్యత, సాంకేతిక సామర్థ్యం, జీవన నాణ్యత వంటి వందకు పైగా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నగరాలకు ర్యాంకులు కేటాయిస్తున్నారు.

Next Story