Visa Services: ఢిల్లీ, అగర్తలాలో బంగ్లాదేశ్ వీసా సేవలు నిలిపివేత..

by Ramesh Naini |   (  Updated:2025-12-22 17:23:43  IST  )

భారత వ్యతిరేకి, ఇంకిలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

Visa Services: ఢిల్లీ, అగర్తలాలో బంగ్లాదేశ్ వీసా సేవలు నిలిపివేత..
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత వ్యతిరేకి, ఇంకిలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేక నిరసనలు తీవ్రమయ్యాయి. బంగ్లాలోని భారత హైకమిషన్ కార్యాలయంపై దాడులు జరిగాయని వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం చటోగ్రామ్‌లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్‌ను క్లోజ్ చేసింది.

ఈ నేపథ్యంలోనే సోమవారం బంగ్లాదేశ్ హైకమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అనివార్య కారణాలు అని పేర్కొంటూ ఢిల్లీ, అగర్తలాలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లలో అన్ని కాన్సులర్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బంగ్లాదేశ్ హై కమిషన్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో భారత్‌లో వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి తాత్కాలిక అసౌకర్యం ఏర్పడే అవకాశముంది. పరిస్థితిని బట్టి త్వరలోనే తాజా సమాచారం వెల్లడిస్తామని హై కమిషన్ పేర్కొంది.

Next Story