Balochistan: మరోసారి పాక్ ఆర్మీపై దాడి చేసిన బలూచ్ రెబల్స్.. 29 మంది మృతి

by S Gopi |

మరో దాడిలో బీఎల్ఏ క్వెట్టాలోని హజార్‌గంజ్ ప్రాంతంలో ఐఈడీ పేల్చడం ద్వారా మరో ఇద్దరు సైనికులను హతమార్చారు.

Balochistan: మరోసారి పాక్ ఆర్మీపై దాడి చేసిన బలూచ్ రెబల్స్.. 29 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్ సైన్యాన్ని వదలడంలేదు. అవకాశం చిక్కినప్పుడల్లా పాక్ ఆర్మీ టార్గెట్‌గా దాడులు చేస్తోంది. తాజాగా రెండు రోజుల్లోనే క్వెట్టా, కలాత్‌లలో పాకిస్తాన్ సైన్యంపై దాడి చేసింది. ఇందులో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్‌లోని కలాత్ ప్రాంతంలోని నిమ్రాగ్ క్రాస్ వద్ద 48 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై బీఎల్ఏ దాడి చేసింది. ఈ దాడి పాకిస్తాన్ భద్రతా దళాలపై జరిగిన ప్రధాన దాడుల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ఈ దాడిలో గత ఆరు నెలల్లో అత్యధికంగా ప్రాణనష్టం సంభవించింది. మరో దాడిలో బీఎల్ఏ క్వెట్టాలోని హజార్‌గంజ్ ప్రాంతంలో ఐఈడీ పేల్చడం ద్వారా మరో ఇద్దరు సైనికులను హతమార్చారు. ఈ విషయాన్ని బీఎల్ఏ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య బీఎల్ఏ మొత్తం 286 దాడులను నిర్వహించింది. ఈ దాడులు బలూచిస్తాన్ వ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఆపరేషన్లలో పేలుళ్లు, తొమ్మిది ప్రత్యేక ఆపరేషన్లు ఉన్నాయి. వీటిలో మూడు ఫిదాయీన్ తరహా ఆత్మాహుతి దాడులు కూడా చేశామని బీఎల్ఏ ప్రకటించింది.

బీఎల్ఏ మొత్తం చేసిన 697 మంది ఆర్మీ సిబ్బంది చనిపోయారని, 290 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. అనేక మౌలిక సదుపాయాలను, 133 వాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా ఒక రైలును హైజాక్ చేశామని, 17 సైనిక స్థావరాలను దెబ్బతీసినట్టు వెల్లడించింది. కనీసం 45 వ్యూహాత్మక ప్రదేశాలను పాకిస్తాన్ నియంత్రణ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు బీఎల్ఏ స్పష్టం చేసింది. ఇంకా బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ కార్యకలాపాల సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు సరఫరా మార్గాలు, కమ్యూనికేషన్, సైనిక లాజిస్టిక్‌లకు అంతరాయం కలిగించడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామని బీఎల్ఏ ప్రకటించుకుంది.

Next Story