Baglihar: పాక్‌కు భారత్ మరో షాక్.. ఆ రెండు నదుల నీటి సరఫరా బంద్ !

by B.Srinivas |

జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Baglihar: పాక్‌కు భారత్ మరో షాక్.. ఆ రెండు నదుల నీటి సరఫరా బంద్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాం (Pahelgam) లో ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ (India pakisthan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్ర దాడిని సీరియస్ గా పరిగణించిన భారత్ దాడికి వ్యతిరేకంగా తీవ్ర చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాయాదిని దెబ్బ మీద దెబ్బ కొడుతూ తగిన గుణపాఠం చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన ఇండియా తాజాగా చీనాబ్ నది నీటి ప్రవాహాన్ని సైతం ఆపేసింది. చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట ద్వారా నీటి సరఫరా అడ్డుకుంది. పాక్‌కు నీటి సరఫరా ఆపేందుకు డ్యామ్ గేట్లను కిందకు దించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో పాక్‌లోని పంజాబ్ ప్రావీన్స్‌పై తీవ్ర ప్రభావం పడనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఆనకట్ట ద్వారా పంజాబ్ ప్రావీన్సుకు నీరు సరఫరా అవుతుంది. అంతేగాక అక్కడి వ్యవసాయం సైతం ఈ నదిపైనే ఆధారపడి ఉంది. దీంతో ఆ ప్రావీన్సుకు చెందిన ప్రజలు ఆందోళనకు గురికాక తప్పదని పలువురు భావిస్తున్నారు.

జీలం నీటినీ ఆపేందుకు సన్నాహాలు

చీనాబ్ నది నీటిని అడ్డుకున్న భారత్ ఇప్పుడు జీలం నదిపైనా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. జీలం ఉపనది అయిన కిషన్‌గంగా ఆనకట్ట వద్ద కూడా త్వరలో ఇలాంటి చర్య తీసుకోవాలని ప్రణాళిక వేసినట్టు సమాచారం. జమ్మూలోని రాంబన్ జిల్లాలో ఉన్న బగ్లిహార్ ఆనకట్ట, ఉత్తర కశ్మీర్‌లోని కిషన్‌గంగా ఆనకట్టలు భారత్‌కు నీటిని నిల్వచేసి విడుదల చేసే సామర్థ్యాన్ని ఇస్తాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఆనకట్టల ద్వారా పాకిస్తాన్‌కు చేరే నీటిని తగ్గించొచ్చని, ముందస్తు హెచ్చరిక లేకుండా నీటిని విడుదల చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్ తాజా నిర్ణయం తీసుకుంది.

బాగ్లిహార్, కిషన్‌గంగాలపై వివాదం!

బాగ్లిహార్ ఆనకట్ట విషయంలో భారత్, పాక్ మధ్య చాలాకాలంగా వివాదం ఉంది. ప్రపంచ బ్యాంకు జోక్యం తర్వాత ఈ కాంట్రవర్సి పరిష్కారమైంది. అలాగే కిషన్ గంగా ఆనకట్టకు సంబంధించి కూడా సమస్య ఉంది. జీలం ఉపనది అయిన నీలం నదిపై కిషన్‌గంగా ఆనకట్ట ప్రభావం ఉన్నందున పాకిస్తాన్ చట్టపరంగా, దౌత్య పరంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్ నుంచి పాకిస్థాన్ కు ప్రవహించే ఈ నదులను రెండు దేశాల జీవనాధారాలుగా పరిగణిస్తారు. ఈ నదులపైనే వ్యవసాయం సైతం ఆధారపడి ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న భారత్ ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా నీటిని అందిస్తోంది. కానీ ఉగ్రదాడి అనంతరం పాక్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్న భారత్ నీటిని ఆపివేయడంతో పాక్ ఆందోళన చెందడం ఖాయమని తెలుస్తోంది.

Next Story