- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆజాద్ కాశ్మీర్ పాక్‌లో భాగం కాదు.. MQM వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ హెచ్చరిక
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో స్థానిక ప్రజలపై పాక్ సైన్యం చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ భద్రతా బలగాలు సాగిస్తున్న అణచివేత చర్యలపై ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (MQM) వ్యవస్థాపకుడు, లండన్ దేశ బహిష్కరణలో ఉన్న నేత అల్తాఫ్ హుస్సేన్ (Altaf Hussain) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. PoKలోని స్థానిక ప్రజలపై పాక్ సైన్యం జరుపుతున్న దాడులను, బలప్రయోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ సైనిక చర్య ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.
కాశ్మీరీలపై ‘యజీది’ తరహా అణచివేత..
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడారు. PoKలోని రావాలాకోట్, ఇతర ప్రాంతాల నుంచి అక్కడి స్థానికులు తనకు ఫోన్ చేసి, పాక్ మిలిటరీ (Pak Military) చేస్తున్న దాడుల గురించి వివరించారని పేర్కొన్నారు. కాశ్మీరీలపై పాక్ రేంజర్లు, ఫ్రాంటియర్ కార్స్ బలగాలు జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ వారికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, కర్ఫ్యూలు విధించి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పాక్ బలగాలు జరుపుతున్న దాడులను ఆయన యజీది తరహా అణచివేతగా అభివర్ణించారు.
ఆజాద్ కాశ్మీర్ పాక్‌లో భాగం కాదు
వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా.. చట్టబద్ధంగా చూసుకున్నా ఆజాద్ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్‌లో భాగం కాదని అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ప్రత్యేక రాజ్యాంగ హోదా ఉన్నప్పటికీ ఇస్లామాబాద్ దానిని బలవంతంగా తన నియంత్రణలో పెట్టుకుందని, సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 80 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని, కాశ్మీర్ భవిష్యత్తును కాశ్మీరీలే నిర్ణయించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన అన్యాయాలు, అణచివేతల వల్లే పాకిస్తాన్ ముక్కలైందని, మిగిలి ఉన్న పాకిస్తాన్‌తో మళ్లీ పాత తప్పులను పునరావృతం చేయవద్దని అల్తాఫ్ హుస్సేన్ హెచ్చరించారు.
కాగా, ఇటీవల విడుదలైన ‘ధురంధర్’, ధరంధర్.. ది రివేంజ్’ మూవీల్లో ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ చీఫ్ అల్తాఫ్ హుస్సేన్ పాత్ర ఆధారంగా ‘జమీల్ జమాలి’ పాత్రను సృష్టించారు. అందులో ‘జమీల్ జమాలీ’ని ఇండియాకు స్పైగా వ్యవహరించినట్లుగా చూపించారు. ప్రస్తుతం అల్తాఫ్ హుస్సేన్, ఫ్యామిలీ దేశ బహిష్కరణ కారణంగా లండన్‌లో నివసిస్తున్నారు.






