అయోధ్యలో 26 లక్షల దీపాలు.. 'దీపోత్సవం'లో రెండు ప్రపంచ రికార్డులు

by Phanindra |

అయోధ్యలో 26 లక్షల దీపాలతో 'దీపోత్సవం' ఘనంగా జరిగింది. ఈ క్రమంలో రెండు ప్రపంచ రికార్డులు కూడా బద్దలుకొట్టింది.

అయోధ్యలో 26 లక్షల దీపాలు.. దీపోత్సవంలో రెండు ప్రపంచ రికార్డులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దీపావళి పండుగ సందర్భంగా అయోధ్య దీపాలతో వెలిగిపోయింది. సరయూ ఘాట్స్‌లో ఏకంగా 26 లక్షల దీపాలను వెలిగించారు. ఈ దీపోత్సవం గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. లక్షలాది మంది భక్తులు ఈ దీపోత్సవాన్ని చూసేందుకు తరలివచ్చారు. సుమారు 33 వేల మంది వాలంటీర్లు కలిసి 56 ఘాట్స్‌లో 26.17 లక్షల దీపాలను వెలిగించారు. ఈ వేడుకల్లో 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో, లేజర్ డిస్‌ప్లేలు, డ్రోన్ షో, రామాయణ పారాయణం తదితర కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ వేడుకల్లో 2,128 మంది హారతులివ్వడం కూడా ప్రపంచ రికార్డే. దీనికి సంబంధించిన గిన్నీస్ వరల్డ్ రికార్డు ధ్రువీకరణ పత్రాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ అందుకున్నారు.

అనంతరం దీపోత్సవ వేడుకల్లో మాట్లాడిన ఆయన.. దీపాలు వెలిగించడం డబ్బు వృధా అని విపక్ష నేత అఖిలేష్ యాదవ్‌ అనడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రామ భక్తులపై తూటాలు పేల్చిన వాళ్లు ఇలాగే మాట్లాడతారని విమర్శించారు. ‘వాళ్లు తూటాలు పేలిస్తే.. బీజేపీ దీపాలు వెలిగిస్తోంది. ఇవి కేవలం దీపావళి కోసం వెలిగించే దీపాలు కాదు. 500 ఏళ్ల చీకటిని పారద్రోలుతూ.. నమ్మకమనే వెలుగులు విరజిమ్మే దీపాలు’ అని చెప్పారు.

Next Story