తమిళనాట సంచలనం.. డీఎంకే, ఏడీఎంకేను చిత్తుచిత్తుగా ఓడించిన ఆటో డ్రైవర్

by Ajay Maddhiboyina |

తమిళనాడు శాసనసభ ఎన్నికల చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయపురం నియోజకవర్గంలో టీవీకే నుండి పోటీ చేసిన ఆటో డ్రైవర్ కె. విజయ్ ధాము అద్భుత విజయం సాధించాడు.

తమిళనాట సంచలనం.. డీఎంకే, ఏడీఎంకేను చిత్తుచిత్తుగా ఓడించిన ఆటో డ్రైవర్
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు శాసనసభ ఎన్నికల చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయపురం నియోజకవర్గంలో టీవీకే నుండి పోటీ చేసిన ఆటో డ్రైవర్ కె. విజయ్ ధాము అద్భుత విజయం సాధించాడు. తొలిసారిగా బరిలో దిగిన టీవీకే తరఫున పోటీ చేసిన విజయ్ రాష్ట్రంలోని అత్యంత శక్తివంతమైన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాడు. విజయ్ ధాము 55వేలకు పైగా ఓట్లు సాధించగా తన సమీప ప్రత్యర్థిపై 14వేల ఓట్ల మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు ఇక్కడ అన్నాడీఎంకే పార్టీ నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జయకుమార్‌ను కూడా ఓడించడం ఆసక్తికరంగా మారింది. ఐదుసార్లు గెలిచిన జయకుమార్ కేవలం 18వేల ఓట్లను మాత్రమే సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యాడు.

డీఎంకే నుండి దివంగత సీనియర్ మంత్రి రెహమాన్ ఖాన్ కుమారుడు సుబైర్ ఖాన్ పోటీ చేయగా రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే ఆటో డ్రైవర్ విజయ్ ధాము టీవీకే అధినేత విజయ్ అభిమానసంఘం అయిన విజయ్ మక్కల్ ఇయక్కంలో సభ్యుడుగా ఉన్నాడు. ఒక సామాన్యుడిగానే విజయ్ ధాము టీవీకే నుండి టికెట్ దక్కించుకున్నాడు. పార్టీ అభ్యర్థుల ప్రకటన కార్యక్రమంలో కన్నీళ్లతో పార్టీ అధినేత విజయ్ ని ఆలింగనం చేసుకోవడంతో ఆటో డ్రైవర్ వీడియో, ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇక ప్రచారంలో విజయ్ ధాము.. మీరు మమ్మల్ని కొత్త ముఖాలు అనుకోవచ్చు. కానీ అభిమాన సంఘాల ద్వారా మేము కొన్నేళ్ల నుండి క్షేత్రస్థాయిలో సేవ చేస్తున్నామని తెలిపి జనాలను తనవైపు తిప్పుకున్నాడు.

Next Story