తమిళనాడులో దారుణం: బిస్కెట్ల ఆశ చూపి.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, మృతి

by Ramesh Naini |

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

తమిళనాడులో దారుణం: బిస్కెట్ల ఆశ చూపి.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బిస్కెట్లు కొనిస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికను తీసుకెళ్లిన బీహార్‌కు చెందిన 19 ఏళ్ల వలస కార్మికుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని పొదల్లో వదిలేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. నిందితుడు బిపిన్ మాంఝీని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీయగా, స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం

మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నార్త్‌లో ఎక్కడో జరుగుతాయని భావించే నేరాలు ఇప్పుడు టీవీకే పాలనలో నిత్యకృత్యంగా మారాయని డీఎంకే అగ్రనేత ఉదయనిధి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారులను కాపాడటంలో సీఎం విజయ్ విఫలమవుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, ఇటీవల తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గ పరిధిలో 14ఏళ్ల బాలికను అపహరించిన ఓ కారు డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

Next Story