Nirmala Sitaraman: విదేశీ పెట్టుబడుల కోసం మరిన్ని సంస్కరణలు

by S Gopi |

బాండ్ మార్కెట్ కోసం ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ప్రారంభం మాత్రమేనని, విదేశీ పెట్టుబడిదారులకు భారత్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్రం, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కలిసి పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు.

Nirmala Sitaraman: విదేశీ పెట్టుబడుల కోసం మరిన్ని సంస్కరణలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్లలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి ప్రభుత్వం త్వరలోనే మరిన్ని చర్యలు ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలు ఇచ్చారు. బాండ్ మార్కెట్ కోసం ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ప్రారంభం మాత్రమేనని, విదేశీ పెట్టుబడిదారులకు భారత్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్రం, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కలిసి పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు. ఫుల్లీ యాక్సెసబుల్ రూట్ (ఎఫ్ఏఆర్), అనుకూల పన్ను విధానం వంటి చర్యలతో విదేశీ పెట్టుబడిదారులకు బాండ్ మార్కెట్‌లో అవకాశాలు విస్తరించాయని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు విదేశాల నుంచి నిధులు సమీకరించేందుకు ఆర్‌బీఐ రూపొందించిన కొత్త చట్రం కూడా మూలధన ప్రవాహాలకు ఊతమిస్తుందని ఆమె చెప్పారు.

అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అనిశ్చితులు భారత్‌కు సవాళ్లుగానే ఉన్నాయని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ముడి చమురు ధరల పెరుగుదల, సరఫరా అంతరాయాలు, ఎరువుల మార్కెట్ అస్థిరత, వాతావరణ మార్పుల ప్రభావం వంటి అంశాలు దేశ ఆర్థికవ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నాయని చెప్పారు. మరోవైపు, డేటా సెంటర్లు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీ) రంగాల్లో భారత్ వేగంగా పెట్టుబడులను ఆకర్షిస్తోందని, ఇక ఈ వృద్ధి బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా టైర్-2 నగరాలకు కూడా విస్తరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయని, రాబోయే దశాబ్దంలో ఈ రంగాలు ఉపాధి, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధికి కీలక ఇంజిన్‌గా మారతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story