కాసేపట్లో భూమి మీదకు వ్యోమగామి శుభాంశు శుక్లా.. సర్వత్రా ఉత్కంఠ

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-14 03:27:12  IST  )

భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ఇవాళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమికి తిరిగి రానున్నారు.

కాసేపట్లో భూమి మీదకు వ్యోమగామి శుభాంశు శుక్లా.. సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ఇవాళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమికి తిరిగి రానున్నారు. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా ఆయన గత నెల జూన్ 19న స్పేస్‌ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ISS‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌గా వ్యవహరించారు. అయితే, భారతదేశం నుంచి అంతరిక్షంలోకి రెండో వ్యోమగామిగా శుభాంశు శుక్లా నిలిచారు. 1984లో రాకేశ్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడు అతడే కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 4:30 గంటల సమయంలో (IST) ISS నుంచి అన్‌డాకింగ్ జరగనుందని, అనంతరం శుభాంశు తోటి సిబ్బందితో కలిసి భూమిపైకి తిరిగి రానున్నారు. లక్నోకు చెందిన శుభాంశు కుటుంబం ఈ క్షణం కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. యాక్సియం-4 మిషన్ విజయవంతంగా పూర్తి చేసి సురక్షితంగా భూమి మీదకు తిరిగి రావాలని ఆయన తల్లి శుభాంశు తల్లి ఆశా శుక్లా అన్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో వాణిజ్య, శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడమే యాక్సియం-4 (Ax-4) మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా సిబ్బంది ISSలో సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో వివిధ శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించారు. అందులో జీవ శాస్త్రం, భౌతిక శాస్త్రం, మెటీరియల్ సైన్స్‌కు సంబంధించిన పరిశోధనలు ఉన్నాయి. యాక్సియం స్పేస్ సంస్థ నాసాతో భాగస్వామ్యంతో వాణిజ్య అంతరిక్ష పరిశోధనలను విస్తరించడం, ప్రైవేట్ సంస్థలకు అంతరిక్షంలో ప్రయోగాలు చేసే అవకాశం కల్పించేలా యాక్సియం-4 పరిశోధన దోహదపడింది. అంతరిక్ష ప్రయాణంలో కొత్త సాంకేతికతలను పరీక్షించడం, భవిష్యత్ మిషన్‌ల కోసం డేటాను వ్యోమగాములు సేకరించారు.

Next Story