నాటి జయలలిత గురువు!.. ఇప్పుడు విజయ్ ఓఎస్డీ..తలపతి పక్కన చేరిన ఈ సెలబ్రిటీ జ్యోతిష్యుడి కథేంటి?

by Prasad Jukanti |   (  Updated:2026-05-12 13:27:18  IST  )

తమిళనాడు సీఎం విజయ్ తన రాజకీయ సలహాదారు, ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌ను ఓఎస్డీగా నియమించారు. ఈ నియామకం వెనుక ఉన్న పొలిటికల్ స్కెచ్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.

నాటి జయలలిత గురువు!.. ఇప్పుడు విజయ్ ఓఎస్డీ..తలపతి పక్కన చేరిన ఈ సెలబ్రిటీ జ్యోతిష్యుడి కథేంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా తన రాజకీయ సలహాదారు, ప్రముఖ జ్యోతిష్యుడు రికి రాధన్ పండిట్‍ను సీఎం ఓఎస్డీగా నియమించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇవాళ వెలువడ్డాయి. అయితే హేతువాద పునాదులున్న తమిళ రాజకీయాల్లో ఒక జ్యోతిష్యుడిని తన ఓఎస్డీగా నియమిస్తూ విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ముఖ్యంగా తన మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీని షాక్‍కు గురి చేస్తోంది. తనకు రాజకీయ సలహాదారు కావడం వల్లే విజయ్ అతడికి ఈ పదవి కట్టబెట్టారా? లేక ఈ ఎత్తుగడ వెనుక మరేదైనా వ్యూహం ఉందా? ఇంతకు ఎవరీ రాధన్ పండిట్? అనే చర్చ యావత్ దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

సెలబ్రిటీల ఆస్ట్రాలజిస్ట్:

నాలుగు దశాబ్దాలుగా వేద జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రంలో అనుభవం కలిగిన రాధన్ పండిట్ భారత దేశంలోని అత్యంత ప్రముఖ సెలబ్రిటీ, రాజకీయ జ్యోతిష్యులలో ఒకరిగా పేరు గాంచారు. 2008లో ఢిల్లీకి మకాం మార్చక ముందు ఆయన అసలు పేరు పండిట్ వెట్రివేల్. కానీ ఆ తర్వాత తన పేరును రాధన్ పండిట్‍గా మార్చుకున్నారు. స్వస్థలం సౌత్ ఇండియా అయినప్పటికీ తన వృత్తి వ్యవహారాల కోసం ఢిల్లీనే ప్రధాన నివాసంగా మార్చుకున్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం ఆయన క్లయింట్ల జాబితాలో భారత రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆయన బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల సీనియర్ సభ్యులకు సలహాలు ఇచ్చినట్లు సమాచారం. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు ఎల్.కె. అద్వానీని తన జీవితంలో గురువుగా భావిస్తారు. ఆయన అందించే "365 డేస్ ప్రిడిక్షన్స్" అనే ప్రీమియం సేవలను సీఈఓలకు, సీనియర్ ప్రభుత్వ అధికారులు పొందుతున్నట్లు సమాచారం.

జయలలితకు గురువుగా:

తాను దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆధ్యాత్మిక గురువుగా పని చేశానని రాధన్ పండిట్ గతంలో క్లెయిమ్ చేసుకున్నారు. 1991లో ఆమె సాధించిన చారిత్రాత్మక విజయాన్ని కచ్చితంగా అంచనా వేసింది ఆయనే అనే ప్రచారం ఉంది. అయితే 1994లో ఒక కష్టకాలం మొదలవుతుందని అతను ఆమెను హెచ్చరించినట్లు సమాచారం. ఆ హెచ్చరిక వారి మధ్య వృత్తిపరమైన విభేదానికి దారితీసిందని ఆ తర్వాత ఆ గ్యాప్ అలాగే ఉండిపోయిందనే టాక్ ఉంది.

విజయ్‍ పై నమ్మకం:

విజయ్‍ను మొదటి నుంచి మద్దతు ఇస్తున్న వారిలో రాధన్ ఒకరు. రాజకీయ విజయం కోసం విజయ్ జాతకానికి అసాధారణమైన “సునామీ లాంటి” శక్తి ఉందని ఆయన వర్ణించారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు దేవాలయాలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక మే 4వ తేదీన ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే చెన్నైలోని నీలన్ కరైన్‍లో ఉన్న తలపతి విజయ్ నివాసానికి శాలువా, పుష్పగుచ్చంతో వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఈ రాధన్ పండిటే. దాదాపు ఏడాది క్రితమే విజయ్ ముఖ్యమంత్రి అవుతారని రాధన్ పండిట్ జోస్యం చెప్పారు. విజయ్ రాజకీయాల్లో ఎందుకు విజయం సాధిస్తాడో 150కి పైగా స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారో ఆయన తన యూట్యూబ్ వీడియోలో 2024లోనే వివరించారు. ఇప్పుడు విజయ్ గెలుపు, అధికారం చేపట్టడంతో ఈ వీడియోను ప్రజలు తెగవీక్షిస్తున్నారు. TVK పార్టీ పేరు విజయ్ పుట్టిన తేదీతో ఖచ్చితంగా సరిపోలడం విజయానికి ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేసిందని ఆ జ్యోతిష్యుడు వాదించారు. విజయ్ జాతకం పరిపాలనకు సరికాదని వాదించిన విమర్శకుల వాదనను ఆయన కొట్టిపారేశారు. విజయ్ జాతకాన్ని పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం వంటి ప్రముఖ మాజీ మంత్రుల జాతకాలతో పోల్చారు. భవిష్యత్ ముఖ్యమంత్రి కావడానికి అవసరమైన రాజసం ఆ నటుడిలో ఉందని గతంలోనే వివరించారు.

పొలిటికల్ వ్యూహం?:

రాధన్ పండిట్‍ను పండిట్‍ను విజయ్ తన ఓఎస్డీగా నియమించడం వెనుక కేవలం ఆయన తన రాజకీయ సలహాదారు కావడం వల్లే కాదని దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విజయ్ ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మిత్ర పక్షాలు ఏ మాత్రం తేడా చేసినా ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలలోని సీనియర్ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్న రాధన్‍ను తన ఓఎస్డీగా నియమించుకోవడం వెనుక భవిష్యత్ రాజకీయ అవసరాలలో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారనే చర్చ తమిళనాట గుప్పుమంటోంది.

అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ

Next Story