ఉత్కంఠకు తెర.. నేడే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

by velandi.Saikiran |   (  Updated:2026-05-03 21:00:59  IST  )

అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి.

ఉత్కంఠకు తెర.. నేడే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
X

‘కౌంట్‌’డౌన్

- నేడే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

- బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో కౌంటింగ్

- అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పైనే..

దిశ, నేషనల్ బ్యూరో : అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. నాలుగు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 823 అసెంబ్లీ స్థానాల భవితవ్యం నేడు తేలనుంది. పశ్చిమ బెంగాల్‌లో 293 సీట్ల ఫలితాలు నేడు వెలువడనుండగా.. ఒక స్థానానికి ఈ నెల 21న రీపోలింగ్ జరగనుంది. మొత్తంగా ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పైనే ఉన్నది. ఆ తర్వాత తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఫలితాలపైనా ఆసక్తి నెలకొంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవ్వగా.. పోస్టల్ బ్యాలెట్లు తొలి అరగంటలో లెక్కిస్తారు. మధ్యాహ్నంకల్లా సదరు రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారనే విషయంపై ప్రాథమికంగా ఒక అంచనా వస్తుంది. కాగా, కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లోకి క్యూఆర్ ఆధారిత ఫొటో ఐడీని పరిశీలించాకే లోనికి పంపిస్తారు. లెక్కింపు కేంద్రంలోకి రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్లు మినహా ఎవరికీ ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఎలాంటి అక్రమ ప్రవేశాలూ జరగకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుంది.

బెంగాల్‌ దక్కేదెవరికి?

ఈ ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఫుల్ టఫ్ ఫైట్ జరిగింది. గత ఎన్నికల్లోనే హోరాహోరీగా తలపడ్డ టీఎంసీ, బీజేపీ ఈసారి అంతకుమించి అన్నట్టుగా పోటీపడ్డాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లల్లో.. టీఎంసీ 215, బీజేపీ 77 గెలుచుకుంది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలంటే రెట్టింపు సీట్లు సాధించాల్సి ఉంటుంది. కాగా, గత ఎన్నికల కన్నా ఘనంగా 226 సీట్లు గెలుచుకుంటామని మమతా బెనర్జీ ప్రకటించారు. ఫాల్తా నియోజకవర్గానికి రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. 21న రీపోలింగ్ జరగనుండటంతో 293 స్థానాల ఫలితాలు మాత్రమే నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్ కేంద్రాలను 87 నుంచి 77కు కుదించిన ఈసీ.. భద్రత కోసం భారీగా కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ సారి గరిష్టంగా 92.47 పోలింగ్ నమోదై రికార్డు సృష్టించింది.

స్టాలిన్‌కే పట్టం?

234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాడులో డీఎంకే ఎదురులేని శక్తిగా బరిలోకి దిగగా.. తళపతి విజయ్ పార్టీ టీవీకే అనూహ్యంగా మెరిసింది. టీవీకే మ్యాజిక్ చేస్తుందని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఓ ఎగ్జిట్ పోల్ అంచనా వేయడంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. విజయ్ కింగ్ అవుతారా? కింగ్ మేకర్ అవుతారా? అనే చర్చమొదలైంది. మరోవైపు అన్నాడీఎంకే పేలవంగానే ఉన్నదని, వచ్చేది డీఎంకే ప్రభుత్వమేననే అంచనాలున్నాయి. 84 శాతం పోలింగ్ నమోదైన తమిళనాడులో నేడు 62 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. ఇక్కడ పోలీసులు, సిబ్బంది, అబ్జర్వర్లు అంతా కలిపి నేడు సుమారు 1.25 లక్షల మంది కౌంటింగ్ విధుల్లో ఉన్నారు.

కేరళంలో మార్పు గాలులు

కేరళంలో మొత్తం 140 సీట్లకు ఎన్నికలు జరగ్గా.. 79.70 శాతం పోలింగ్ నమోదైంది. 43 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుండగా.. భద్రత కోసం 25 కంపెనీల బలగాలు మోహరించాయి. ఇక్కడ 71 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కోసం లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్‌లు పోటీ పడ్డాయి. ప్రస్తుతం సీపీఎం అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళం.. ఇది వరకే ఇక్కడ రెండుసార్లు వరుసగా అధికారాన్ని చేపట్టిన ఆ పార్టీ.. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? లేక కాంగ్రెస్‌ చాన్స్ దక్కించుకుంటుందా? అనేది నేడు తేలనుంది.

అసోం, పుదుచ్చేరిలో ఎన్డీయేనేనా?

126 సీట్లున్న అసోంలో ఎన్డీయే నేతృత్వంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం, 30 సీట్లున్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీయే నేతృత్వంలోని రంగసామి ప్రభుత్వమున్నది. ఈ రెండింటిలో కాంగ్రెస్ కూటమి అధికారం కోసం బరిలోకి దిగింది. సీఎం హిమంత, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ సహా 722 మంది అభ్యర్థులు అసోంలో బరి ఉన్నారు. పుదుచ్చేరిలో రంగసామి కూటమికి కాంగ్రెస్, డీఎంకేల ఇండియా కూటమి టఫ్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇక్కడ మొత్తం 30 సీట్లే కావడంతో సింగిల్ డిజిట్ సీట్లు కూడా అధికారానికి కీలకంగా ఉంటాయి.

Next Story