WMO: ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేడిగా ఆసియా ప్రాంతం

by S Gopi |

దీనివల్ల ఈ ప్రాంతంలోని దేశాల ఆర్థికవ్యవస్థలు, పర్యావరణం, సమాజంపై భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి.

WMO: ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేడిగా ఆసియా ప్రాంతం
X

దిశ, నేషనల్ బ్యూరో: భూమి క్రమంగా వేడెక్కుతున్నదని కొత్త డేటా సూచిస్తోంది. మరీ ముఖ్యంగా ఆసియా ప్రాంతం ప్రస్తుతం ఉన్న ప్రపంచ సగటు కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోంది. 2024 ఏడాది ఇప్పటివరకు అత్యంత వేడి లేదా రెండో అత్యంత వేడి సంవత్సరంగా మారిందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. డబ్ల్యూఎంఓ నివేదిక ప్రకారం, అసాధారణ ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమైన వేడి వాతావరణానికి ఆజ్యం పోస్తున్నాయి. దీనివల్ల ఈ ప్రాంతంలోని దేశాల ఆర్థికవ్యవస్థలు, పర్యావరణం, సమాజంపై భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. 1961-1990 కాలంలో నమోదైన వేడిగాలుల కంటే 1991-2024 మధ్య రెట్టింపు స్థాయిలో వేడి నమోదైంది. ఒక్క 2024లోనే రికార్డు స్థాయిలో వేడి గాలులు పెరిగాయని నివేదిక తెలిపింది. అంతేకాకుండా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉన్నాయి. ఆసియా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే దాదాపు రెట్టింపు ఉందని నివేదిక వెల్లడించింది.

సముద్ర మట్టం పెరుగుదల

ఆసియా ఖండంలోని పసిఫిక్, హిందూ మహాసముద్రం పరిధిలో సముద్ర మట్టం పెరుగుదల ప్రపంచ సగటును మించిపోయిందని, ఇది లోతట్టు తీర ప్రాంతాలకు ప్రమాద తీవ్రతను పెంచుతుందని నివేదిక పేర్కొంది.

తగ్గుతున్న హిమానీనదాలు

హిమానీనదాలపై పెరుగుతున్న ఉష్ణోగ్రతల వినాశకరమైన ప్రభావాన్ని డబ్ల్యూఎంఓ నివేదిక ప్రస్తావించింది. తగ్గిన శీతాకాలపు హిమపాతం, తీవ్రమైన వేసవి వేడి హిమానీనదాలకు సవాలుగా మారాయి. మధ్య హిమాలయాలు, టియాన్ షాన్లలో 24లో 23 హిమానీనదాలు భారీగా కరిగిపోతున్నాయి. దీనివల్ల వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న సంఘటనలు పెరిగాయని నివేదిక తెలిపింది. ఆసియా ప్రాంతంలోని అనేక దేశాలలో అధిక వర్షపాత విధ్వంసం వల్ల భారీ ప్రాణనష్టం, తుఫానులు, కరువుతో భారీ ఆర్థిక, వ్యవసాయ నష్టాలు ఏర్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. ప్రాణాలను, జీవనోపాధిని కాపాడేందుకు జాతీయ వాతావరణ, జలసంబంధిత కృషి చాలా ముఖ్యమని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టె సౌలో చెప్పారు.

Next Story