- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముస్లింలు ఆ మూడు వదులుకోవాలి.. మందిర్-మసీదు వివాదాలకు అదొక్కటే పరిష్కారం!
ముస్లింలు ఆ మూడు ప్రాంతాలను వదులుకోవాలని మాజీ ఏఎస్ఐ డైరెక్టర్ సూచించారు. అదొక్కటే మందిర్-మసీదు వివాదాలకు పరిష్కారమన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: గ్యాన్‌వాపీ, రామజన్మభూమి, మథుర.. ఈ మూడు ప్రాంతాల్లో జరుగుతున్న మందిర్-మసీద్ గొడవలపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మాజీ రీజనల్ డైరెక్టర్ కేకే మహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడు ప్రాంతాలు హిందువులకు మక్కా, మదీనా అంత ప్రాముఖ్యత ఉన్నవని, కావున వీటిని ముస్లింలే స్వచ్ఛందంగా వీడాలని ఆయన సూచించారు. అదే సమయంలో ఇతరప్రాంతాల్లో ఇకపై హిందువులు కేసులు వేయకూడదని, ఇదొక్కటే పరిష్కారమని మహమ్మద్ అన్నారు. అయోధ్యలోని రామజన్మభూమి వివాదం సుప్రీంకోర్టులో తీరినప్పటికీ.. మిగతా రెండు ప్రాంతాలు కూడా హిందువులకు చాలా ముఖ్యమైనవని ఆయన చెప్పారు. ఇదే సమయంలో అయోధ్య మందిరంపై వివాదం కేవలం లెఫ్టిస్టుల వల్లే జరిగిందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీబీ లాల్ నేతృత్వంలో బాబ్రీ మసీదులో 1976లో తవ్వకాలు జరిపిన బృందంలో ఉన్న మహమ్మద్.. ఈ బృందం సమర్పించిన ఆధారాలను నిరాకరించాలని ముస్లింలను ఒక కమ్యూనిస్టు చరిత్రకారుడు తప్పుదోవ పట్టించినట్లు వెల్లడించారు.
తవ్వకాలు జరిగిన సమయంలో చాలామంది ముస్లింలు అయోధ్య ఆలయం నిర్మాణానికి అనుమతించి, గొడవలు లేకుండా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని అనుకున్నారని మహమ్మద్ గుర్తుచేసుకున్నారు. ‘ఆర్కియాలజిస్టు కాని ఒక చరిత్రకారుడు.. ఒక్కసారి కూడా తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని సందర్వించకుండానే, బీబీ లాల్ బృందం సేకరించిన ఆధారాలను అంగీకరించకుండా, ఇదంతా తప్పుడు ప్రచారమని వాదించారు. సదరు చరిత్రకారుడే బీబీ లాల్ బృందం సేకరించిన ఆధారాలను అంగీకరించకుండా ముస్లిం కమ్యూనిటీని తప్పుదోవ పట్టించారు. ఆలయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలనూ లాల్ బృందం సేకరించలేదని వారిని నమ్మించారు’ అని మహమ్మద్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇలా వివాదం సృష్టించిన చరిత్రకారుడు ఒక్కసారి కూడా తవ్వకాలు జరిగిన ప్రాంతానికి రాలేదని, కనీస విషయ జ్ఞానం లేకుండా ముస్లింలను తప్పుడు ప్రచారంతో నమ్మబలికారని వెల్లడించారు. అదే సమయంలో ఈ మందిర్-మసీదు అంశాలు చాలా సున్నితమైనవని చెప్పిన ఆయన.. రామజన్మభూమి తర్వాత గ్యాన్‌వాపీ, మథుర ప్రాంతాలను ముస్లింలు స్వయంగా హిందువులకు అప్పగించేయాలని కోరారు. అదే సమయంలో ఈ మూడు ప్రాంతాల తర్వాత మిగతా చోట్ల హిందువులు కూడా ఇక కేసులు వేయకుండా ఉండాలని సూచించారు. ఇదొక్కటే అందరినీ కలిపి ఉంచే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
బీజేపీ పాలన.. ఏఎస్ఐకి చీకటి రోజులు!
ఇదే సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలో ఆర్కియాలజీ విభాగంలో గొప్పగా ఎలాంటి ఆవిష్కరణలు జరగలేదని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం నుంచి తాము ఎంతో ఆశించామని, తమకు ఈ సర్కారు నుంచి మద్దతు, భద్రత లభిస్తుందని నమ్మామని, భారత సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారని అనుకున్నామని మహమ్మద్ తెలిపారు. కానీ అలా ఏం జరగలేదన్న ఆయన.. బీజేపీ పాలనలోని 11 ఏళ్లు ఏఎస్ఐకి చీకటి రోజులంటూ విమర్శించారు.






