Ashwini Vaishnaw: తమిళం ఎంతో మధురమైన భాష.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

by B.Srinivas |

ఎన్ఈపీలో ప్రవేశపెట్టిన త్రి భాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Ashwini Vaishnaw: తమిళం ఎంతో మధురమైన భాష.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)లో ప్రవేశపెట్టిన త్రి భాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళం ఎంతో మధురమైన భాష అని అభివర్ణించారు. దేశం, ప్రపంచంలో ఉన్న ఆస్తుల్లో తమిళ భాష ఒకటని కొనియాడారు. రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్‌లో శనివారం నిర్వహించిన జెట్వర్క్ ఎలక్ట్రానిక్స్ తయారీ కర్మాగారం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘తమిళ భాష ఎంతో మధురమైంది. ఈ భాషలో నాకు తెలిసింది మూడే పదాలు. వనక్కం(నమస్తే), ఎప్పడి ఇరుకీంగ (ఎలా ఉన్నారు), నంద్రి (ధన్యవాదాలు)’ అని వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయ భాషకు తగిన గౌరవం లభించేలా ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారన్నారు.

‘ఐఐటీ కాన్పూర్‌లో విద్యను అభ్యసిస్తున్నప్పుడు సదాగోపన్ అనే ప్రొఫెసర్ నాకు తమిళ భాషను పరిచయం చేశాడు. ఆయన నాకు తమిళ సంస్కృతికి చెందిన అనేక కోణాలను నేర్పించారు. ఇది చాలా చాలా లోతైన సంస్కృతి, చాలా పురాతన సంస్కృతి. మనమందరం తమిళ సంస్కృతిని, తమిళ భాషను గౌరవిస్తాం. ఇది మన దేశ, ప్రపంచ ఆస్తుల్లో ఒకటి. దాని పట్ల గర్వపడుతూనూ అన్ని భారతీయ భాషలను ఆస్వాదిద్దాం. ప్రతి భారతీయ భాషకు గొప్ప స్థానం లభించేలా ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారు’ అని తెలిపారు. స్నేహితులు, సంబంధాలకు కొన్ని భాషా సమస్యలు అడ్డుగా వచ్చాయని, అలాంటి అడ్డంకులను అధిగమించి ముందుకు సాగాలని సూచించారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే అంతిమ లక్ష్యమని నొక్కి చెప్పారు.

Next Story