Asha Bhosle: గానమే కాదు.. వంటలతోనూ హృదయాలు గెలిచిన ఆశా భోస్లే! ‘మా కీ దాల్’ ఫేమస్

by Ramesh Naini |

ఏడు దశాబ్దాల పాటు తన మధురమైన గానంతో కోట్లాది మంది సంగీత అభిమానులను ఉర్రూతలూగించి, ఆదివారం (ఏప్రిల్ 12న) కన్నుమూసిన లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గురించి ఎందరికో తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.

Asha Bhosle: గానమే కాదు.. వంటలతోనూ హృదయాలు గెలిచిన ఆశా భోస్లే! ‘మా కీ దాల్’ ఫేమస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏడు దశాబ్దాల పాటు తన మధురమైన గానంతో కోట్లాది మంది సంగీత అభిమానులను ఉర్రూతలూగించి, ఆదివారం (ఏప్రిల్ 12న) కన్నుమూసిన లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గురించి ఎందరికో తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆమె ప్రపంచానికి పరిచయమైన ‘మెలోడీ క్వీన్’ మాత్రమే కాదు.. వంటలను అమితంగా ప్రేమించే గొప్ప ప్రవీణురాలు. తనదైన ‘మా కీ దాల్’, ‘బిర్యానీ’లతో బాలీవుడ్ ప్రముఖుల మనసు దోచుకున్న ఆమె, ఏకంగా విదేశాల్లో రెస్టారెంట్ చైన్ ప్రారంభించి ఆ రంగంలోనూ సక్సెస్ అయ్యారు.

బాలీవుడ్‌ను ఫిదా చేసిన రుచులు..

చిత్రసీమలో ఆశా భోస్లే వంటలకు సైతం ఎంతో పేరుండేది. వారానికి కనీసం 60 నుంచి 70 మందికి ఆమె స్వయంగా పెద్ద పాత్రల్లో వంటలు చేసి వడ్డించేవారని సినీ వర్గాలు చెబుతున్నాయి. పెషావర్‌ వాసుల నుంచి ఆమె నేర్చుకున్న ‘మా కీ దాల్’ రుచి మరెక్కడా దొరకదని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో గర్వంగా చెప్పారు. ఇక ఆశా భోస్లే చేసే ‘షమీ కబాబ్స్’ అంటే ఆమె అక్క, గాన కోకిల లతా మంగేష్కర్‌కు ఎంతో ఇష్టం. నటి మాలా సిన్హా నుంచి మోమోస్, దిగ్గజ నటుడు రాజ్‌ కపూర్ నుంచి పెషావర్ బిర్యానీ, ఢిల్లీలోని బుఖారా రెస్టారెంట్ చెఫ్‌ల నుంచి దాల్ మఖానీ, మజ్రూహ్ సుల్తాన్‌పురి భార్య నుంచి మరో రకం బిర్యానీ చేయడం తాను నేర్చుకున్నానని భోస్లే గతంలో వెల్లడించారు. పాటల రికార్డింగ్ ముగించుకుని రాగానే తన కొడుకు ఆనంద్ కోసం స్వయంగా బిర్యానీ, చికెన్ వండేవారట.

అంతర్జాతీయ స్థాయిలో ‘ఆశాస్’ రెస్టారెంట్లు

వంటలపై తనకున్న అపారమైన మక్కువతో 2002లో దుబాయ్‌లో ‘ఆశాస్’ (Asha's) పేరుతో ఫైన్-డైనింగ్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే ఈ రెస్టారెంట్ చైన్ యూఏఈ, మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటు బ్రిటన్ (బర్మింగ్‌హామ్, మాంచెస్టర్)కు కూడా విస్తరించింది. ‘పాటలాగే వంట కూడా ఇతరులు ఆనందించడం కోసం ప్రేమతో, మనసులోంచి రావాలి’ అని ఆశా భోస్లే నమ్మేవారు. తన రెస్టారెంట్ లో చెఫ్ కోటు వేసుకోవడాన్ని ఎంతో గర్వంగా, ఒక అందమైన దుస్తులు ధరించినట్లుగా ఫీలయ్యేవారు. మైక్ ముందు ఎంతటి తన్మయత్వం చెందేవారో, వంటగదిలోనూ అంతే ఆనందాన్ని ఆస్వాదించిన ఆశా భోస్లే జీవితం.. ఆమె అందించిన రుచుల్లాగే ఎప్పటికీ మధురం అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story