అర్వింద్ కేజ్రివాల్ కారుపై దాడి.. బీజేపీ పనే అంటున్న ఆప్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-01-18 13:14:44  IST  )

అర్వింద్ కేజ్రివాల్ కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారన్న ఆప్ ఆరోపణలపై న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ స్పందించారు.

అర్వింద్ కేజ్రివాల్ కారుపై దాడి.. బీజేపీ పనే అంటున్న ఆప్
X

యువకులను ఢీ కొట్టి వెళ్లాడంటున్న బీజేపీ

- వేడెక్కిన ఢిల్లీ రాజకీయం

దిశ, నేషనల్ బ్యూరో:

ఢిల్లీ ఎన్నికల వేళ ఆప్, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ కారుపై శనివారం కొంత మంది దాడి చేశారు. ఇది బీజేపీ గూండాల పనే అని ఆప్ ఆరోపిస్తోంది. ఓటమి భయంతో.. ఆందోళనలో ఉన్న బీజేపీ తమ గూండాలతో అర్వింద్ కేజ్రివాల్‌పైన ఇటుకలు, రాళ్లతో దాడి చేయించింది. కేజ్రివాల్ గాయపడితే ప్రచారం చేయలేడనే ఉద్దేశంతోనే బీజేపీ మనుషులు ఇలా దాడికి తెగబడ్డారు. కానీ ఇలాంటి పిరికిపంద చర్యలకు కేజ్రివాల్ బయపడడు. జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారంటూ ఆప్ తన 'ఎక్స్' ఖాతాలో రాసుకొచ్చింది. కాగా.. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రివాల్ క్యాంపెయినింగ్ చేయడానికి రాగా, కొంత మంది యువకులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. వారిని తప్పించుకుంటూ కార్‌ను ముందుకు పోనిచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

యువకుల ఢీ కొట్టాడు : పర్వేష్ వర్మ

అర్వింద్ కేజ్రివాల్ కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారన్న ఆప్ ఆరోపణలపై న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ స్పందించారు. అర్వింద్ కేజ్రివాల్ కారుతో ఇద్దరు యువకులను ఢీకొట్టి, వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయారని అన్నారు. యువకులను ఎందుకు ఢీకొట్టావని ప్రజలు ప్రశ్నిస్తుండగానే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారని.. కనీసం గాయపడిన వాళ్లు ఎలా ఉన్నారని కూడా పట్టించుకోలేదని పర్వేష్ వర్మ అంటుననారు. ప్రస్తుతం వారిద్దరినీ లేడా హార్డింగ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నామన్నారు. ఓటమి భయంతోనే ఇలా పారిపోయారని.. తాను వెళ్లి ఆసుపత్రిలో వారిని పరామర్శిస్తానని పర్వేష్ తెలిపారు. కాగా, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అర్వింద్ కేజ్రివాల్, పర్వేష్ వర్మ‌తో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు.

Next Story