Kejriwal: ఆయనకు బీజేపీ ఏ పదవిని ఆఫర్ చేసిందో? సీఈసీపై కేజ్రీవాల్ విసుర్లు

by Shamantha N |

“రిటైర్ అవ్వబోతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు బీజేపీ ఏ పదవిని ఆఫర్ చేసిందో?” అని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రశ్నించారు.

Kejriwal: ఆయనకు బీజేపీ ఏ పదవిని ఆఫర్ చేసిందో? సీఈసీపై కేజ్రీవాల్ విసుర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: “రిటైర్ అవ్వబోతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు బీజేపీ ఏ పదవిని ఆఫర్ చేసిందో?” అని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రశ్నించారు. ఎన్నికల సంఘం (Election Commission) పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎదుట ఈసీ లొంగిపోవడం చూస్తుంటే స్వతంత్ర సంస్థ తన ఉనికిని కోల్పోయినట్లు ఉందన్నారు. ఈ నెలాఖరుకు రిటైర్‌ అవుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ (Rajiv Kumar)కు బీజేపీ ఏ పదవిని ఆఫర్‌ చేసిందని ప్రశ్నించారు. ‘‘ఏ గవర్నర్‌ పదవినో లేదా రాష్ట్రపతి పదవినో ఇస్తామని బీజేపీ ఆయనకు హామీ ఇచ్చి ఉంటుంది. అందుకే పదవీకాంక్షతో దేశ ప్రజాస్వామ్యాన్ని, భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్‌ సీఈసీపై ఆరోపణలు చేశారు. ఇకనైనా వ్యక్తిగత ప్రయోజనాలపై ఆలోచనలను వీడి చివరి కొద్ది రోజులైనా సీఈసీ తన విధులను న్యాయబద్ధంగా నిర్వర్తించాలని కోరుతున్నామన్నారు.

బీజేపీ గూండాల దాడులు

ఎన్నికలు (Delhi Assembly Elections) సమీపిస్తుండడంతో బీజేపీ గూండాలు, ఆప్‌ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని కేజ్రీవాల్‌ అన్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవడానికి ఢిల్లీ పోలీసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఒకవైపు, తాము ఢిల్లీ ప్రజల అభివృద్ధికి పాటుపడుతూ నెలకు రూ.25,000 ఆదా చేస్తుంటే.. మరోవైపు ఇతర పార్టీలు దేశ రాజధానికి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఓటింగ్‌ సమయంలో బీజేపీ ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా చర్యలు తీసుకునేందుకు వీలుగా తమ నేతలకు స్పై కెమెరాలు ఇస్తున్నామని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఇకపోతే, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు రానున్నాయి.

Next Story