ఢిల్లీలో కాలుష్య నివారణకు కృత్రిమ వర్షాలు

by Muthe.Rajitha |

దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీలో కాలుష్య నివారణకు కృత్రిమ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీపావళి అనంతరం వాతావరణ పరిస్థితులు మరింత దిగజారాయి. నేడు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 306గా నమోదై తీవ్రమైన కాలుష్య కేటగిరీలోకి చేరినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కృత్రిమ వర్షం (Artificial Rains) కురిపించేందుకు దిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ‘క్లౌడ్ సీడింగ్’ ప్రక్రియను పూర్తి చేసింది.

ఐఐటీ కాన్పూర్ నుంచి బయల్దేరిన ఎయిర్‌క్రాఫ్ట్ సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి రసాయన ఉత్ప్రేరకాలను వివిధ ప్రాంతాల మేఘాలపై చల్లి ఈ ప్రక్రియను నిర్వహించింది. దీంతో మరికొన్ని గంటల్లో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. నగరంలో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించేందుకు సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం చేసుకున్న ఢిల్లీ ప్రభుత్వం.. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య ఎప్పుడైనా ట్రయల్స్‌కు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (DGCA) అనుమతి పొందింది. ఈ ప్రక్రియకు కావాల్సిన బడ్జెట్‌ను మేలోనే మంత్రివర్గం ఆమోదించింది.

అయితే ప్రతికూల వాతావరణం, రుతుపవన పరిస్థితుల కారణంగా పలుమార్లు క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ వాయిదా పడింది. ముందుగా శాస్త్రవేత్తలు అనువైన మేఘాలను గుర్తించి, వాటిలో సరిపడా తేమ ఉన్నా వర్షించే పరిస్థితులు లేనప్పుడు సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి ఉత్ప్రేరకాలను మేఘాలపై చల్లి క్లౌడ్ సీడింగ్ చేస్తారు. ఇవి తేమను కరిగించి వర్షపు బిందువులుగా కింద పడేలా చేస్తాయి. కొన్నిసార్లు పొడి మంచును కూడా వాడి మేఘాలు చల్లబడి కృత్రిమ వర్షం కురిసేందుకు సహకరిస్తాయి. దీని వల్ల వాతావరణంలోని కాలుష్య వాయువులు వర్షంతోపాటు నేలకు చేరతాయి.

Next Story