ఆపరేషన్ సిందూర్‌ 2.0 కి రెడీగా ఉండండి.. సైన్యానికి ఆర్మీ చీఫ్ సంచలన ఆదేశాలు

by Gantepaka Srikanth |

భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్‌ 2.0 కి రెడీగా ఉండండి.. సైన్యానికి ఆర్మీ చీఫ్ సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లోని ఆర్మీ చెక్ పోస్ట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. త్వరలో ఆపరేషన్ సిందూర్ 2.0 ఉండబోతోందని సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు అన్నిటినీ ధ్వంసం చేయాల్సి ఉందని అన్నారు. అది కుదరకపోతే ఇక ఏకంగా పాకిస్తాన్‌ను భూగోళంలోనే లేకుండా చేస్తామని హెచ్చరిక చేశారు. ప్రతీ పరిస్థితికి సైన్యం సిద్ధంగా ఉండాలని అన్నారు. ‘‘ప్రపంచపటంలో ఉండాలనుకుంటే ఉగ్రవాదాన్ని ఆపి తీరాల్సిందే.. లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుంది జాగ్రత్త’’ అని ఆర్మీ చీఫ్‌ గట్టిగా హెచ్చరించారు.

ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) సమయంలో మన సైన్యం దాయాది దేశంతో చెస్‌ ఆడిందని అన్నారు. శత్రువు తదుపరి కదలికలు ఏమిటో కూడా ఆ సమయంలో తమకు తెలియదని.. ఈ పరిస్థితిని గ్రేజోన్ అంటారని అన్నారు. అయినప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ.. ఆ దేశానికి చెక్‌ పెట్టామని అన్నారు. ఈ ఆపరేషన్‌ను ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ద్వివేది (Upendra Dwivedi) తెలిపారు. మన పౌరులను బలి తీసుకున్న ఉగ్రవాదులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరినప్పుడు.. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించారు. దీంతో తాము ఉగ్ర స్థావరాలను సమర్థవంతంగా ధ్వంసం చేశామన్నారు.

Next Story