Balochistan: పాక్‌లో చెలరేగిన బలూచ్ రెబల్స్

by S Gopi |

బాధితుల మృతదేహాలు అర్ధరాత్రి తర్వాత బుల్లెట్ గాయాలతో పర్వత ప్రాంతంలో కనిపించాయన్నారు.

Balochistan: పాక్‌లో చెలరేగిన బలూచ్ రెబల్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగు దేశం పాకిస్తాన్‌లో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఆ దేశంలోని వేర్పాటువాద బలూచ్ రెబల్స్ మరింత దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. తాజాగా దక్షిణ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పలు వాహనాలపై దాడులు చేసి తొమ్మిది మంది బస్సు ప్రయాణికులను కిడ్నాప్ చేసి చంపారని అధికారులు శుక్రవారం ధృవీకరించారు. గురువారం సాయంత్రం వివిధ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని కిడ్నాప్ చేసినట్లు ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ తెలిపారు. దాడి చేసిన వారు ప్రయాణికులను సమీపంలోని పర్వత ప్రాంతంలోకి తీసుకెళ్లారని వెల్లడించారు. మరో ప్రభుత్వ అధికారి నవీద్ ఆలం మాట్లాడుతూ.. బాధితుల మృతదేహాలు అర్ధరాత్రి తర్వాత బుల్లెట్ గాయాలతో పర్వత ప్రాంతంలో కనిపించాయన్నారు. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూప్ కూడా ప్రకటన జారీ చేయకపోవడం గమనార్హం. కానీ, ఈ ప్రాంతంలో ఇటువంటి దాడులు చేసిన చరిత్ర బలూచ్ మిలిటెంట్లకు ఉండటంతో వారే దీనికి కారణమని భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలో అత్యంత చురుకైన తిరుగుబాటు గ్రూపులలో ఒకటైన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులో ఉన్న ఖనిజ సంపన్న ప్రావిన్స్‌లో చాలా కాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ అధికారులు పంజాబ్ ప్రావిన్స్‌కు ప్రయోజనం చేకూర్చడానికి బలూచిస్తాన్ వనరులను దోపిడీ చేస్తున్నారని, ఇది తీవ్రమైన అశాంతి, హింసకు దారితీస్తుందని బలూచ్ మిలిటెంట్లు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ వారం ప్రారంభంలో పాక్ ప్రభుత్వంపై అతిపెద్ద దాడిని నిర్వహించింది. 'ఆపరేషన్ బామ్' పేరుతో చేసిన ఈ దాడులు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న అనేక జిల్లాల్లోని ప్రభుత్వ, సైనిక స్థావరాల టార్గెట్‌గా జరిగింది. ఈ సందర్భంగా దశాబ్దాల నాటి పోరాటంలో ఇదొక కొత్త అధ్యాయమని లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

Next Story