Rajnath Singh: అణ్వాయుధాలను చూసుకోగల పాక్‌ సామర్థ్యంపై అంతర్జాతీయ జోక్యం కోరిన రాజ్‌నాథ్ సింగ్

by S Gopi |

భారత సైన్యం లక్ష్యాలను మాత్రమే చేధిస్తుంది, శత్రువులు జరిగిన నష్టాన్ని లెక్కిస్తారు.

Rajnath Singh: అణ్వాయుధాలను చూసుకోగల పాక్‌ సామర్థ్యంపై అంతర్జాతీయ జోక్యం కోరిన రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిక కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం తొలిసారిగా జమ్మూకశ్మీర్‌ను సందర్శించారు. ఆ ప్రాంతంలోని భద్రతను, భారత సాయుధ దళాల సంసిద్ధతను సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో పడిన పాకిస్తాన్ షెల్స్‌ను పరిశీలించారు. ఆర్మీ 15వ కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి సైనికులతో సంభాషించారు. ఆయనతో పాటు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు అణ్వాయుధాలను భద్రంగా చూసుకునే సామర్థ్యం ఉందా అని ప్రశ్నించారు. మన సైన్యం లక్ష్యం చాలా ఖచ్చితంగా ఉంటుందని ప్రపంచానికి తెలుసు. భారత సైన్యం లక్ష్యాలను మాత్రమే చేధిస్తుంది, శత్రువులు జరిగిన నష్టాన్ని లెక్కిస్తారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎంత బలంగా స్పందిస్తుందో, వారి అణ్వాయుధ బ్లాక్‌మెయిల్‌ను ఎంతమేరకు పట్టించుకుంటామనే వాస్తవాన్ని ఇప్పుడు తెలుసుకుంటారు. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ ఎంత బాధ్యతారహితంగా బెదిరించిందనే విషయాన్ని ప్రపంచమంతా చూసింది. ఇలాంటి బాధ్యతరహిత, మోసపూరిత దేశం చేతిలో అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా అనే సందేహం తనకు కలుగుతోంది. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) పర్యవేక్షణలోకి తీసుకోవడం మంచిదని ఆయన కోరారు.

అనంతరం దళాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉగ్రవాదం, ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు జవాన్లు చూపిన తెగువకు, వారి త్యాగానికి ధన్యవాదాలు తెలిపారు. వీరమరణం పొందిన జవాన్లతో పాటు పెహల్గాం దాడిలో మరణించిన సామాన్య పౌరులకు నివాళులర్పించారు. గాయపడిన సైనికుల త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ను 'అతిపెద్ద బాధ్యత'గా అభివర్ణించిన రక్షణ మంత్రి.. ఇది ఉగ్రవాదంపై జరిగిన అతిపెద్ద ఆపరేషన్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ ఎంత దూరమైన వెళ్తుందని, పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం మానేయాలని సూచించారు. కాగా, అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. సైనికులతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

Next Story