బుల్లెట్ ఇంటర్నెట్.. బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్‌గా డౌన్లోడ్స్

by Naga Rani Yarlagadda |

అత్యాధునిక టెక్నాలజీలో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే జపాన్‌ మరో అద్భుతాన్ని పరిచయం చేసింది.

బుల్లెట్ ఇంటర్నెట్.. బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్‌గా డౌన్లోడ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యాధునిక టెక్నాలజీలో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే జపాన్‌ మరో అద్భుతాన్ని పరిచయం చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ టెక్నాలజీని (Japan Bullet Speed Internet) అభివృద్ధి చేసింది. ఇది సెకనుకు 1.02 పెటాబిట్స్‌ స్పీడ్‌తో డేటాను పంపగలదు. ఈ ఇంటర్నెట్‌ వేగం.. అమెరికాలోని సగటు ఇంటర్నెట్‌ స్పీడ్‌ కంటే 35 లక్షల రెట్లు అధికంగా ఉందని, భారతదేశ స్పీడ్‌తో పోలిస్తే దాదాపు 1.6 కోట్ల రెట్లు వేగవంతం అని జపాన్‌ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (NICT) ప్రకటించింది.

ఈ టెక్నాలజీ అభివృద్ధిలో NICTలోని ఫోటోనిక్ నెట్‌వర్క్ ల్యాబ్, సుమితోమో ఎలక్ట్రిక్, యూరోపియన్ భాగస్వాములు కలిసి పని చేశారు. ఈ ఇంటర్నెట్‌ ద్వారా కేవలం ఒక్క సెకనులోనే వికీపీడియా మొత్తం సమాచారాన్ని 10వేల సార్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వారు వెల్లడించారు. ఇదే వేగంతో, 8కే రిజల్యూషన్‌ వీడియోలు కూడా క్షణాల్లోనే డౌన్‌లోడ్ చేయవచ్చు. ఈ నెట్‌వర్క్‌కు ప్రత్యేకంగా రూపొందించిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, 19 లూపింగ్ సర్క్యూట్లు ఉపయోగించారు. ప్రతి లూప్‌ పొడవు 86.1 కిలోమీటర్లు ఉండగా, మొత్తం వ్యవస్థ ద్వారా 1808 కిలోమీటర్ల దూరం వరకు డేటాను వేగంగా పంపించగలగడం దీని ప్రత్యేకత. సిగ్నల్‌లను బలంగా రిసీవ్‌ చేసి డేటాను మరింత దూరం వరకూ పంపించడంలో ఈ టెక్నాలజీ కీలకంగా నిలిచింది.

ప్రస్తుతం అందుబాటులోకి రాదా?

ఇప్పుడు ఈ టెక్నాలజీ సాధారణ ప్రజల వినియోగానికి అందుబాటులోకి రావడంలేదు. కానీ, ప్రభుత్వ సంస్థలు, డేటా సెంటర్ల నిర్వహణ సంస్థలు, టెలికాం కంపెనీలు దీన్ని తమ అవసరాలకు ఉపయోగించేందుకు ముందడుగు వేస్తున్నాయి. ఈ పరిశోధన భవిష్యత్తులో 6G నెట్‌వర్క్, సముద్రగర్భ కమ్యూనికేషన్‌ కేబుల్స్‌ వంటి పలు రంగాల్లో మోడల్‌గా నిలవనుంది. జపాన్‌ టెక్నాలజీ ప్రపంచాన్ని మరోసారి అబ్బురపరిచిందని చెప్పుకోవచ్చు.

Next Story