AP Singh: ఆపరేషన్ సిందూర్‌లో 5 పాక్ ఫైటర్ జెట్స్ కూల్చేశాం.. ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్

by B.Srinivas |

ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్థాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశామని ఐఏఎఫ్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

AP Singh: ఆపరేషన్ సిందూర్‌లో 5 పాక్ ఫైటర్ జెట్స్ కూల్చేశాం.. ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్థాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ (Amar preeth singh) వెల్లడించారు. అంతేగాక సుమారు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఒక నిఘా విమానాన్ని కూడా ధ్వంసం చేశామని తెలిపారు. ఉపరితలం నుండి గగనతల లక్ష్యాన్ని చేధించడంలో ఇదే రికార్డు అని చెప్పారు. బెంగళూరులో శనివారం జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కాత్రే స్మారక ఉపన్యాసంలో అమర్‌ప్రీత్ ప్రసంగించారు. భారత్ పాక్ ఘర్షణ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గొప్పగా పని చేసిందని కొనియాడారు. ఇటీవల రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 రక్షణ వ్యవస్థ గేమ్ చేంజర్ గా నిలిచిందని, అది అద్బుతమైన పని తీరు కనబర్చిందని ప్రశంసించారు. పాక్ వద్ద లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబులు ఉన్నప్పటికీ వాటిని ఆదేశం ఉపయోగించలేక పోయిందన్నారు. వారు భారత్ లోకి చొచ్చుకురాలేకపోయారని తెలిపారు. పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లిందని, వాటిలో ఎఫ్-16 జెట్‌లను ఉంచిన జాకోబాబాద్ వైమానిక స్థావరం కూడా ఉందని వెల్లడించారు.

రాజకీయ నాయకత్వం భేష్

భారత్ రాజకీయ నాయకత్వంపై అమర్ ప్రీత్ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడానికి రాజకీయ సంకల్పమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు అందాయని, వాటిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. అందువల్ల ప్రణాళికలు వేయడానికి, అమలు చేయడానికి మాకు పూర్తి స్వేచ్ఛ లభించిందని చెప్పారు. మూడు సైన్యాల మధ్య పూర్తి సమన్వయం ఉందని, సీడీఎస్ పదవి ఎంతో మార్పు తెచ్చిందని నొక్కి చెప్పారు. అందరినీ ఒక చోట చేర్చడానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు.

90 గంటల్లోనే బీభత్సం

భారత దళాలు పాక్‌పై స్పష్టంగా పైచేయి సాధించాయని, కేవలం 80-90 గంటల్లోనే పాక్‌కు నష్టం కలిగించాయని తెలిపారు. దాడులు కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గ్రహించిన పాక్ ముందుకు వచ్చి డీజీఎంతో స్థాయి చర్చలకు పిలుపునిచ్చిందని చెప్పారు. దీనికి వెంటనే అంగీకరించామన్నారు. ‘మేము బాలాకోట్‌లో వైమానిక దాడులు చేసినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలను సేకరించలేకపోయాం. కాబట్టి దానిపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తారు. కానీ ఈసారి ఏమి సాధించామో ప్రపంచానికి తెలియజేశాం, దీనికి ఎంతగానో సంతోషిస్తున్నా అని చెప్పారు. కాగా, పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పాకిస్తాన్ వైమానిక దళానికి జరిగిన నష్టం గురించి ఎయిర్ ఫోర్స్ బహిరంగంగా వెల్లడించడం ఇదే మొదటిసారి.

Next Story