- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైపూర్‌లో కలకలం.. ఉద్యోగం కోసం తల్లిని చంపిన యువతి కేసులో మరో ట్విస్ట్
రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో కన్నతల్లిని పక్కా ప్రణాళికతో హత్య చేయించిన లా విద్యార్థిని ఆయుషి కేసులో మరో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో కన్నతల్లిని పక్కా ప్రణాళికతో హత్య చేయించిన లా విద్యార్థిని ఆయుషి కేసులో మరో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తల్లి నీరజ్ శర్మ (45) హత్య కేసులో జైల్లో ఉన్న ఆయుషి.. అంతకుముందు తన తండ్రి విజయ్ శర్మ మరణానికి కూడా కారణమైందంటూ మృతురాలి సోదరుడు (ఆయుషి మేనమామ) రాకేశ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం, ఆస్తిని దక్కించుకోవడానికే ఆయుషి ఈ దారుణాలకు ఒడిగట్టిందని ఆయన ఆరోపించారు.
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. రాజస్తాన్ హైకోర్టులో కోర్ట్ మాస్టర్‌గా పనిచేసిన విజయ్ శర్మ మరణించడంతో, కారుణ్య నియామకం కింద ఆయన భార్య నీరజ్ శర్మకు కోర్టులో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. అయితే, ఆ ఉద్యోగంతో పాటు కుటుంబ ఆస్తిని కూడా సొంతం చేసుకోవాలని ఆయుషి ఆశపడింది. ఈ క్రమంలో తన కజిన్ (సొంత బాబాయ్ కొడుకు) బలరామ్, బాబాయ్ మోహన్‌లతో కలిసి రూ.7 లక్షలకు సుపారీ ఇచ్చి, జూలై 3న నీరజ్ శర్మను స్కార్పియో వాహనంతో గుద్ది చంపించింది. దీనిని కేవలం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితురాలు ప్రయత్నించింది.
తండ్రిని కూడా వైద్యం అందకుండా చంపేసిందా?
ఆయుషి అరెస్ట్ తర్వాత ఆమె మేనమామ రాకేశ్ శర్మ చేసిన ఆరోపణల ప్రకారం.. 2024లో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తండ్రి విజయ్ శర్మకు ఆయుషి ఉద్దేశపూర్వకంగానే సరైన వైద్యం అందకుండా చేసింది. మెరుగైన చికిత్స పేరిట ఆయన్ను తీసుకెళ్లి మూడు నెలల పాటు ఎవరికీ సమాచారం లేకుండా రహస్య ప్రదేశంలో ఉంచిందని, ఆ తర్వాత ఆయనకు అమర్చిన ఫీడింగ్ ట్యూబ్‌ను తొలగించి, 2025 ఏప్రిల్‌లో అవయవాల వైఫల్యంతో మరణించేలా చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి చనిపోయిన వెంటనే కారుణ్య ఉద్యోగం కోసం ఆయుషి దరఖాస్తు చేయాలని చూసిందని, కానీ అది తల్లికి రావడంతో ఆమెపై కక్ష పెంచుకుందని తెలిపారు.
పోలీసుల దర్యాప్తు..
ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్న ఆయుషికి చట్టాలపై అవగాహన ఉండటంతో ఎవరికీ అనుమానం రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పోలీసులు తెలిపారు. తనకంటే దివ్యాంగుడైన తమ్ముడిని తల్లి ఎక్కువగా ప్రేమిస్తోందనే ద్వేషం, ఆస్తి కాంక్షే ఈ హత్యకు ప్రధాన కారణాలని విచారణలో తేలింది. ప్రస్తుతం ఆయుషితో పాటు సుపారీ హంతకులు పోలీసుల కస్టడీలో ఉండగా, పరారీలో ఉన్న సహ నిందితుడు బలరామ్ కోసం గాలిస్తున్నారు. తండ్రి మరణంపై వచ్చిన ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.






