Paper leak: మరో పేపర్ లీక్ ఘటన.. మహా ‘టెట్‌’ పరీక్ష వాయిదా

by Ramesh Naini |

మరో పేపర్ లీక్ ఘటన వెలుగుచూసింది. ఆదివారం జరగాల్సిన టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET-2026) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడంతో అధికారులు అప్రమత్తమై పరీక్షను వాయిదా వేశారు.

Paper leak: మరో పేపర్ లీక్ ఘటన.. మహా ‘టెట్‌’ పరీక్ష వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలో మరో పేపర్ లీక్ ఘటన వెలుగుచూసింది. ఆదివారం జరగాల్సిన టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET-2026) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడంతో అధికారులు అప్రమత్తమై పరీక్షను వాయిదా వేశారు. థానే జిల్లాలోని భివండీ ప్రాంతంలో పేపర్ లీక్ వ్యవహారం జరుగుతున్నట్లు అందిన రహస్య సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

పలువురు అదుపులో.. పత్రాల స్వాధీనం

ఈ దాడుల్లో కొందరి వద్ద నుంచి పరీక్షకు సంబంధించిన పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ పత్రాలు టెట్ అసలు ప్రశ్నపత్రంతో సరిపోలినట్లు ‘మహారాష్ట్ర స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (MSCE)’ అధికారులు నిర్ధారించినట్లు జాతీయ మీడియా సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉందన్న అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు పేపర్ ఎలా లీక్ అయింది? దీని వెనుక భారీ ముఠా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

కొత్త తేదీలు త్వరలో..

పేపర్ లీక్ నిర్ధారణ కావడంతో పరీక్ష పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని ఆదివారం జరగాల్సిన టెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని వెల్లడిస్తామని, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వచ్చే అప్‌డేట్స్ కోసం వేచి చూడాలని సూచించింది. కాగా, ఇప్పటికే దేశంలో నీట్ యూజీ పేపర్ లీక్ ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన వారిలో మహారాష్ట్రకు చెందిన వారు ఉండటం విశేషం.

Next Story