ఢిల్లీలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్!

by Malleboina Mahesh |   (  Updated:2026-07-06 10:39:25  IST  )

దేశ రాజధాని ఢిల్లీలో పాక్ ఐఎస్ఐ హ్యాండ్లర్ ‘షహజాద్ భట్టి’ ఉగ్ర మాడ్యూల్‌ను పోలీస్ స్పెషల్ సెల్ భగ్నం చేసింది... పంజాబ్, ఢిల్లీలో నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

ఢిల్లీలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ ఉగ్రకుట్రను స్పెషల్ పోలీస్ అధికారులు భగ్నం చేశారు. ఢిల్లీలో దాడికి పాకిస్తాన్ ఐఎస్ఐ (ISI) పన్నిన వ్యూహాన్ని ఈ ప్రత్యేక విభాగం (Special Cell - New Delhi Range) సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్‌స్టర్-టర్నడ్-టెర్రరిస్ట్ షహజాద్ భట్టి (Shahzad Bhatti) గూఢచార నెట్‌వర్క్‌కు చెందిన రెండు వేర్వేరు మాడ్యూళ్లను పోలీసులు విజయవంతంగా ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఢిల్లీ, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించి నలుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు.

ధార్మిక స్థలాలు, పోలీస్ స్టేషన్లపై రెక్కీ..

పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఉగ్ర నెట్‌వర్క్ రెండు విభిన్న విభాగాలుగా పనిచేస్తోంది. ఒకటి ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో దాడులకు ప్లాన్ చేసే ఉగ్రవాద విభాగం (Terror Module) కాగా, రెండోది పాక్ సరిహద్దుల నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మత్తు పదార్థాలను సరఫరా చేసే ఆయుధాల అక్రమ రవాణా విభాగం (Arms Trafficking Module). అరెస్ట్ అయిన వారిలో పంజాబ్‌కు చెందిన ముగ్గురితో పాటు ఢిల్లీలో పట్టుబడిన గగన్‌ప్రీత్ అనే నిందితుడు ఉన్నాడు. ఈ గగన్‌ప్రీత్ దిల్లీలోని సున్నితమైన ధార్మిక స్థలాలు, పోలీస్ స్టేషన్లు, భద్రతా తనిఖీ కేంద్రాల (Police Pickets) వద్ద వీడియోలు తీస్తూ ముమ్మరంగా రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. ఇక్కడ భారీగా కాల్పులు జరిపేందుకు అతనికి పాక్ హ్యాండ్లర్లు విదేశీ నంబర్ల ద్వారా ఆదేశాలు ఇచ్చారు.

అత్యాధునిక విదేశీ తుపాకులు స్వాధీనం..

నిందితుల నుంచి పోలీసులు జిగానా (Zigana) రకానికి చెందిన అత్యాధునిక విదేశీ పిస్టళ్లు, తొమ్మిది లైవ్ బుల్లెట్లు, హ్యాండ్లర్లతో మాట్లాడేందుకు ఉపయోగించిన ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ యువతను సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసి, వారికి ఆయుధాలు అందించి దేశంలో అశాంతి సృష్టించేందుకు షహజాద్ భట్టి కుట్ర పన్నినట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ (DCP) ప్రవీణ్ కుమార్ త్రిపాఠి వెల్లడించారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేసి, ఈ అంతర్రాష్ట్ర ముఠా వెనుక ఉన్న మరికొందరు స్థానిక లింకుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Next Story