ఎన్నికల వేళ దారుణం.. మరో హిందూ వ్యాపారి హత్య

by Gantepaka Srikanth |

బంగ్లాదేశ్‌లో హిందూ నేతలపై హింస ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఎన్నికల వేళ దారుణం.. మరో హిందూ వ్యాపారి హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌(Bangladesh)లో హిందూ నేతలపై హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మిమెన్‌సింగ్‌ జిల్లాలో సుసేన్‌ చంద్రశేఖర్‌ అనే హిందూ వ్యాపారి హత్య(Hindu Murder)కు గురయ్యాడు. సోమవారం అర్ధరాత్రి కొందరు దుండగులు చంద్రశేఖర్‌‌ను కారులోనే కిరాతకంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఫిబ్రవరి 12వ తేదీన బంగ్లాదేశ్‌‌లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో హిందువుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఇటీవలే 86 ఏళ్ల వృద్ధుడు, మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ పోలీసుల కస్టడీలోనే తుదిశ్వాస విడిచారు. గత 18 నెలల క్రితం ఆయనపై ఓ మూక దాడి చేయగా.. ఆయనకు సాయం చేయాల్సిన పోలీసులు ఆయన్నే అరెస్ట్ చేశారు. అప్పటినుంచి ఆయన్ను జైల్లోనే ఉంచుతూ.. ఆయనపై అనేక కేసులు పెడుతూ వస్తున్నారు. అయితే ఈమధ్య ఆయన ఆరోగ్యం క్షీణించింది. బెయిల్ కావాలంటూ అనేకమార్లు కోర్టులో మొరపెట్టుకున్నా ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. కనీసం ఆయన్ను అధికారులు ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. ఈక్రమంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఎన్నికలపై షేక్ హసీనా విమర్శలు

మరోవైపు బంగ్లాదేశ్‌ ఎన్నికలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలను ఓ నాటకంగా అభివర్ణించారు. దేశంలోని అతిపెద్ద రాజకీయ పక్షమైన తమ పార్టీ(అవామీ లీగ్‌)ని పోటీ చేయకుండా నిషేధించి నిర్వహించే ఈ ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడే ఏ ప్రభుత్వమైనా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా హసీనా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

Next Story