- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Canada PM race: కెనడా ప్రధాని రేసు నుంచి భారత సంతతి మహిళ ఔట్
కెనడా ప్రధాని రేసు నుంచి భారత సంతతికి చెందిన ఎంపీ అనితా ఆనంద్ (Indian Origin MP Anita Anand) తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె కీలక ప్రకటన చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ప్రధాని రేసు నుంచి భారత సంతతికి చెందిన ఎంపీ అనితా ఆనంద్ (Indian Origin MP Anita Anand) తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె కీలక ప్రకటన చేశారు. కెనడా ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఓక్విల్లే పార్లమెంట్ ఎంపీగా మరోసారి ఎన్నికవ్వాలని కోరుకోవట్లేదని తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల వరకు ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతల్లోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. పార్లమెంటు సభ్యురాలిగా లిబరల్ పార్టీ టీమ్‌లో తనను స్వాగతించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కీలక మంత్రిత్వ శాఖలు అప్పగించిన ట్రూడోకు, తనను ఎన్నుకున్న ఓక్విల్లే ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. భవిష్యత్తులో విద్యారంగంలో సేవలు అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మనం దేశానికి, సమాజానికి అనేక రకాలుగా సేవ చేయవచ్చు. ప్రజా ప్రతినిధిగా కెనడాను సురక్షితంగా, బలంగా, స్వేచ్ఛగా ఉంచేందుకు కృషి చేశా. కెనడాకు వలస వచ్చిన నా తల్లిదండ్రులు ఈ దేశ గొప్పదనాన్ని.. మాకు అందించిన సహకారాన్ని చెప్తూ పెంచారు. అందుకే మా లిబరల్ టీమ్ కోసం, ఓక్విల్లే కోసం..అన్నింటికంటే కెనడా కోసం నేను ఇక్కడ ఉంటాను.’’ అని అనిత పేర్కొన్నారు.
రేసులో మరో నలుగురు
ఇటీవలే, జస్టిన్ ట్రూడో (Trudeau) తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. దీంతో కెనడా ప్రధానిగా పోటీపడే మొదటి ఐదుగురిలో ప్రస్తుత రవాణా శాఖ మంత్రి, భారత సంతతి ఎంపీ అనితా ఇందిరా ఆనంద్ (Indian Origin MP Anita Anand) పేరు కూడా ఉంది. ఆమె ప్రస్తుతం రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళ్, పంజాబీ మూలాలున్న 57ఏళ్ల అనితా ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2019లో ఓక్‌విల్లే నుంచి ఎంపీగా ఎన్నికైన వెంటనే ట్రూడో క్యాబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు ప్రజాసేవల మంత్రిగా పని చేయగా.. ఆ తర్వాత రెండేళ్ల పాటు రక్షణమంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అనిత తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ కాగా.. తల్లి పంజాబీకి చెందిన డాక్టర్.






