- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వటసావిత్రి పూజలో అపశ్రుతి.. భక్తుల నిర్లక్ష్యంతో కాలిపోయిన పురాతన మర్రిచెట్టు.. (వీడియో)
బీహార్‌లోని పాట్నా జిల్లా ఫతుహాలో వటసావిత్రి వ్రతం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్‌లోని పాట్నా జిల్లా ఫతుహాలో వటసావిత్రి వ్రతం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. మహిళల నిర్లక్ష్యం, అనాలోచిత చర్య కారణంగా శతాబ్దాల నాటి ఓ పురాతన మర్రిచెట్టు అగ్నికి ఆహుతైంది. ఫతుహా బ్లాక్ ఆఫీస్ ఆవరణలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. భర్త ఆయురారోగ్యాల కోసం మహిళలు వటసావిత్రి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మహిళలు మర్రిచెట్టుకు పవిత్ర దారాలు కట్టి, చెట్టుకు అత్యంత సమీపంలో నెయ్యితో మట్టి ప్రమిదలను వెలిగించారు. అయితే, ఒక దీపం మంట ప్రమాదవశాత్తూ చెట్టుకు చుట్టిన దారాలకు అంటుకోవడంతో క్షణాల్లో మంటలు చెట్టుకు దట్టంగా వ్యాపించాయి.
భయాందోళనల్లో భక్తులు
కళ్లెదుటే మంటలు వేగంగా చెలరేగడంతో పూజలో ఉన్న మహిళలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో పూజా సామగ్రిని అక్కడే వదిలేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు, అధికారులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, చెట్టులోని కొంత భాగం కాలిపోవడంతో పాటు పూజా సామాగ్రి దగ్ధమైంది. సంప్రదాయం పేరిట పూజలు చేస్తూ, కనీస జాగ్రత్తలు పాటించకుండా చారిత్రక వృక్షం కాలిపోవడానికి కారణమైన వారి తీరుపై పర్యావరణ ప్రేమికులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.






