నీరవ్ మోదీకి ఊహించిన షాక్.. త్వరలోనే భారత్‌కు అప్పగింత!

by Malleboina Mahesh |

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అంతర్జాతీయ కోర్టులోనూ చుక్కెదురు.. ఈసీహెచ్‌ఆర్ (ECHR) అప్పీల్ రిజెక్ట్.. త్వరలోనే భారత్‌కు అప్పగింత!

నీరవ్ మోదీకి ఊహించిన షాక్.. త్వరలోనే భారత్‌కు అప్పగింత!
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో జరిగిన వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని (Nirav Modi) కటకటాల్లోకి నెట్టేందుకు భారత ప్రభుత్వానికి భారీ విజయం దక్కింది. బ్రిటన్ నుంచి తనను భారతదేశానికి అప్పగించడాన్ని (Extradition) సవాల్ చేస్తూ ఆయన పెట్టుకున్న చివరి ఆశల దరఖాస్తు కూడా తిరస్కరణకు గురైంది. ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేసే అత్యున్నత సంస్థ ‘యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్’ (ECHR) నీరవ్ మోదీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. దీంతో ఆయనకు అంతర్జాతీయంగా ఉన్న అన్ని న్యాయపరమైన రక్షణ దారులు పూర్తిగా మూసుకుపోయాయి.

త్వరలోనే భారత్‌కు తరలింపు..

తనకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని, భారత జైళ్లలో సరైన సదుపాయాలు సాకులు చూపుతూ నీరవ్ మోదీ గత కొన్నేళ్లుగా లండన్ కోర్టులలో కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏప్రిల్‌లో బ్రిటన్ (UK) హైకోర్టు సైతం తనను భారత్‌కు అప్పగించకుండా రక్షణ కల్పించాలన్న ఆయన చివరి వినతిని తిరస్కరించింది. యూకే న్యాయస్థానాల తీర్పుల అనంతరం ఆయన అంతర్జాతీయ మానవ హక్కుల కోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా చుక్కెదురైంది. ఈ తాజా పరిణామంతో నీరవ్ మోదీని లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలు నుండి భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ (CBI), ఈడీ (ED) లకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. లండన్ హోం శాఖ అధికారిక ఉత్తర్వుల అనంతరం త్వరలోనే ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Next Story