నిష్పక్షపాత విచారణ జరగాల్సిందే.. NEET (UG) లీకేజీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

by Kema Shiva Kumar |

నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీకేజీ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఫైర్ అయింది.

నిష్పక్షపాత విచారణ జరగాల్సిందే.. NEET (UG) లీకేజీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్-యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. గతంలో ఇన్ని వివాదాలు జరిగినా.. సంబంధిత అధికారులు ఇంకా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదా అని కామెంట్ చేసింది. దేశంలో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), విద్యా శాఖల వైఫల్యాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. లక్షల మంది విద్యార్థులు పగలు, రాత్రి కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే.. పేపర్ లీక్‌లు, గ్రేస్ మార్కుల అక్రమాల వల్ల వారి నమ్మకం దెబ్బతింటోందని కోర్టు పేర్కొంది. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని మండిపడింది.

తప్పు కప్పిపుచ్చుకోడం సరికాదు..

ఓ పరీక్ష పవిత్రత (Sanctity) దెబ్బతిన్నప్పుడు, దానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఎక్కడో ఒకచోట తప్పు జరిగిందని తెలిసినప్పుడు, దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం సరికాదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని, తదుపరి చర్యలపై స్పష్టత ఇవ్వాలని ఎన్‌టీఏ (NTA), కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న తరుణంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని, అక్రమాలు జరిగిన కేంద్రాల్లో తిరిగి పరీక్ష (Re-Exam) నిర్వహించాలా అనే అంశంపై కోర్టు మరిన్ని కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

Next Story