- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐ సమ్మిట్‌లో 8 ఏళ్ల పిల్లాడు.. ఎవరీ రణ్‌వీర్ సచ్‌దేవా?
ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతున్న వేళ, భారత రాజధానిలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఒక ఎనిమిదేళ్ల బాలుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చుట్టూ తిరుగుతున్న వేళ, భారత రాజధానిలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఒక ఎనిమిదేళ్ల బాలుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ అంతర్జాతీయ సదస్సులో అతిచిన్న వయస్కుడైన 'కీనోట్ స్పీకర్'గా రణ్‌వీర్ సచ్‌దేవా రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్‌మన్ వంటి టెక్ దిగ్గజాలతో రణ్‌వీర్ భేటీ అవ్వడం విశేషం.
సదస్సులో ఏం మాట్లాడాడు?
ప్రాచీన భారతీయ తత్వశాస్త్రానికి, ఆధునిక సాంకేతికతకు మధ్య ఉన్న సంబంధాన్ని రణ్‌వీర్ తన ప్రసంగంలో వివరించాడు. భారతీయ ఏఐ మోడల్స్ దేశ జీడీపీకి ఎలా తోడ్పడతాయో, ఏఐ అక్షరాస్యతను ఎలా పెంచవచ్చో తనదైన శైలిలో వివరించి మేధావులను విస్మయానికి గురిచేశాడు.
3 ఏళ్లకే లెక్కల గమ్మత్తు.. 5 ఏళ్లకే ప్రోగ్రామర్!
2017లో జన్మించిన రణ్‌వీర్ చిన్నతనం నుంచే అసాధారణ ప్రతిభను కనబరుస్తున్నాడు. 3 ఏళ్ల వయస్సులో సంఖ్యల స్క్వేర్లు (Squares), క్యూబ్స్ (Cubes) అలవోకగా చెప్పేవాడు. 4 ఏళ్ల వయస్సులో మార్స్ మిషన్‌పై రణ్‌వీర్ చేసిన ప్రాజెక్టును నాసా (NASA) తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించింది. 5 ఏళ్ల వయస్సులో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన 'యాపిల్ స్విఫ్ట్ ప్రోగ్రామర్'గా గుర్తింపు పొందాడు. ఈ ప్రతిభ చూసి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా అతడిని కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించారు.
ఐక్యరాజ్యసమితి వేదికపై..
ఆరేళ్ల ప్రాయంలోనే ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ అసెంబ్లీకి ఆహ్వానం అందుకున్న అతిపిన్న వయస్కుడిగా రణ్‌వీర్ చరిత్ర సృష్టించాడు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) సాధనలో అతడు చేస్తున్న కృషికి గానూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అలాగే, ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన టెడెక్స్ (TEDx) స్పీకర్‌గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. సాంకేతికతపై తనకున్న అవగాహనతో "Are You Born With AI?" అనే పుస్తకాన్ని కూడా రణ్‌వీర్ రచించాడు. ప్రస్తుతం ఈ బాలుడు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో మెషిన్ లెర్నింగ్ కోర్సును అభ్యసిస్తున్నాడు. ఆరేళ్ల వయస్సులోనే అతడి తెలివితేటలు 14 ఏళ్ల విద్యార్థితో సమానమని కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్స్ స్పష్టం చేయడం గమనార్హం.






