Amith shah: వరుస ఓటములతో నైతికత మారిందా?.. రాహుల్ పై అమిత్ షా ఫైర్

by B.Srinivas |

లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు.

Amith shah: వరుస ఓటములతో నైతికత మారిందా?.. రాహుల్ పై అమిత్ షా ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) విమర్శలు గుప్పించారు. వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాహుల్ నైతికత మారిందా అని ప్రశ్నించారు. తాజాగా అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై నిరసనలు తెలపడంపై ఆయన స్పందిస్తూ.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ చించి వేసిన ఘటనను ప్రస్తావించారు. ‘ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాపాడటానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను రాహుల్ ఎందుకు చింపేశాడు? ఆ రోజు ఆయనకు నైతికత ఉంటే, ఇప్పుడు ఏమైంది? వరుసగా ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మీ నైతికత మారిందా? నైతిక విలువలు ఎన్నికల్లో గెలుపు ఓటమిలతో సంబంధం కలిగి ఉండవు. అవి సూర్యుడు, చంద్రుడిలా ధృఢంగా ఉండాలి’ అని అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కాంగ్రెస్ ధ్వంధ విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు.

‘నేడు దేశంలో ఎన్డీచే కూటమికి చెందిన సీఎంలు ఎక్కువ మంది ఉన్నారు. ప్రధానమంత్రి కూడా ఎన్డీయేకి చెందినవారే. అటువంటి పరిస్థితిలో ఈ బిల్లు ప్రతిపక్షాలపై ప్రశ్నలు లేవనెత్తడమే గాక తమ సీఎంలపైనా ప్రభావం చూపుతుంది’ అని తెలిపారు. ఒకవేళ అది నకిలీ కేసు అయితే దేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టు కళ్ళు మూసుకుని కూర్చోలేవని, అవి బెయిల్ మంజూరు చేయగలవని నొక్కి చెప్పారు. ఏ కేసులోనైనా బెయిల్ మంజూరు చేసే హక్కు న్యాయస్థానాలకు ఉందన్నారు.సెషన్స్ కోర్టు ఎవరికైనా రెండేళ్ల జైలు శిక్ష విధిస్తే, ఆ సభ్యుని సభ్యత్వం స్వయంచాలకంగా పోతుందనే నిబంధన కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని గుర్తు చేశారు.

ప్రతిపక్షం జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని కోరుకుంటుందని ఆరోపించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో, ప్రతిపక్షాలు ప్రధాని కాపాడటానికి ప్రయత్నించాయని, ఇప్పటికి కూడా ఏ నాయకుడైనా జైలుకు వెళితే, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని సులభంగా ఏర్పాటు చేయాలని వారు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. జైలును సీఎం, పీఎం నివాసంగా మారుస్తారా, అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేయొచ్చా అని ప్రశ్నించారు. ఈ తరహా విధానం దేశ ప్రజాస్వామ్యానికి మంచిదేనా అని నిలదీశారు. జైలు కెళ్లిన సీఎం, పీఎం పదవులను తొలగించే బిల్లు ఖచ్చితంగా పార్లమెంటులో ఆమోదం పొందుతుందని, ఎందుకంటే కాంగ్రెస్‌లో నైతికతకు మద్దతిచ్చేవారు అనేక మంది ఉన్నారని నొక్కి చెప్పారు.

Next Story