అమిత్ షా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. చివరి నిమిషంలో పర్యటన రద్దు!

by Gantepaka Srikanth |

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో అవాంతరం ఏర్పడింది.

అమిత్ షా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. చివరి నిమిషంలో పర్యటన రద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో అవాంతరం ఏర్పడింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అసోంలోని దుబ్రీ జిల్లా గోలక్‌గంజ్ (Golakganj) పర్యటన రద్దు అయింది. వివరాల్లోకి వెళితే.. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా శుక్రవారం దుబ్రీ జిల్లాలోని రతియాదహలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు పర్యటనను నిలిపివేశారు.

ఫోన్ ద్వారా ప్రసంగం..

పర్యటన రద్దయినప్పటికీ, సభా ప్రాంగణానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మొబైల్ ఫోన్ ద్వారా ప్రసంగించారు. సాంకేతిక లోపం వల్ల తాను భౌతికంగా హాజరుకాలేకపోతున్నానని, కానీ అసోం అభివృద్ధి పట్ల తన నిబద్ధత కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి అశ్విని రాయ్ సర్కార్‌కు మద్దతుగా ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హెలికాప్టర్ లోపం సరిదిద్దిన తర్వాత లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఆయన తన తదుపరి పర్యటనలను కొనసాగించే అవకాశం ఉంది.

Next Story