డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తే.. SC, ST సీట్ల పెంపును వ్యతిరేకించినట్లే: లోక్‌సభలో అమిత్ షా

by Gantepaka Srikanth |

లోక్‌సభలో అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సుదీర్ఘ ప్రసంగం చేశారు.

డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తే.. SC, ST సీట్ల పెంపును వ్యతిరేకించినట్లే: లోక్‌సభలో అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే, దేశ భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వడం లేదని అమిత్ షా ఆరోపించారు. "బయటకు మద్దతు ఇస్తామని చెబుతూనే.. సభలో మాత్రం 'అయితే', 'కానీ' అంటూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. విపక్షాలది మహిళా వ్యతిరేక మైండ్‌సెట్" అని ఆయన మండిపడ్డారు. పదే పదే సభ సమయాన్ని వృథా చేయడం రాహుల్ గాంధీకి ఒక ఆటగా మారిందని, దేశ ప్రయోజనాల కంటే రాజకీయాలే ఆయనకు ముఖ్యమని విమర్శించారు.

ఓటర్ల తేడా..

తెలంగాణలోని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అదే సమయంలో దేశంలో కొన్నిచోట్ల కేవలం 6 లక్షల ఓటర్లే ఉన్నారు. ఒక ప్రతినిధి 38 లక్షల మందికి ఎలా న్యాయం చేయగలరు?" అని ఆయన ప్రశ్నించారు. 1971 నుంచి సీట్ల పెంపుపై ఉన్న 'ఫ్రీజ్' కారణంగా ఈ తప్పులు జరిగాయని, డీలిమిటేషన్ ద్వారానే వీటిని సరిచేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కారణంగా 2021లో జనగణన చేయలేకపోయామని, అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ 2026లో కులగణనతో పాటే జనగణన చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. ప్రస్తుతం నిర్వహించబోయే సర్వేలో జనాభా లెక్కల్లోనే 'కులం' (Caste Column) కాలమ్‌ను చేర్చినట్లు ఆయన ప్రకటించారు.

దక్షిణాది రాష్ట్రాల భయాందోళనలపై స్పందన...

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి అన్యాయం జరుగుతుందన్న ప్రచారాన్ని అమిత్ షా కొట్టిపారేశారు. ఉత్తరాదికి, దక్షిణాదికి దేశంలో సమాన అధికారాలు ఉన్నాయి. మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం. విభజన రాజకీయాలతో అధికారం దక్కదు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనేది కేవలం దుష్ప్రచారం మాత్రమే" అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే జనాభా లెక్కలకు, డీలిమిటేషన్‌కు లింక్ పెట్టారని, ఇప్పుడు ఆ నెపాన్ని తమపై నెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు.

చివరగా ప్రతిపక్షాలు కోరినట్లుగా డీలిమిటేషన్‌ బిల్లులో సీట్ల పెంపు 50 శాతానికి తగ్గకుండా మార్పులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం. ఒకే ఒక గంటలో మార్పులు చేసి బిల్లు పెట్టడానికి సిద్ధం. ఇందుకు విపక్షాలు అంగీకరిస్తాయా? అని అమిత్ షా సవాల్ చేశారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తే ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపును వ్యతిరేకించినట్లే అని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ జనాభా పెరిగితే సీట్లు కూడా పెరుగుతాయని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే తమిళనాడులో ఆరు సీట్లు తగ్గుతాయని అన్నారు. కానీ అలా చేయకుండా 50శాతం పెంచుతున్నామని తెలిపారు.

Next Story