Kejriwal: ఢిల్లీ శాంతిభద్రతలపై కేజ్రీవాల్ ఆందోళన.. కేంద్రంపై విమర్శలు

by Shamantha N |

దేశ రాజధానిలో హత్యలు జరుగుతుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం ఎన్నికల బిజీలో ఉన్నారని ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అన్నారు.

Kejriwal: ఢిల్లీ శాంతిభద్రతలపై కేజ్రీవాల్ ఆందోళన.. కేంద్రంపై విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో హత్యలు జరుగుతుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం ఎన్నికల బిజీలో ఉన్నారని ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీలోని శాంతి భద్రతల పరిస్థితులపై కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన హత్యల గురించి స్పందించారు. ఢిల్లీని గ్యాంగ్‌స్టర్లు నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నా అమిత్‌షా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలోని శాంతి భద్రతల పూర్తి బాధ్యత ఆయనదేనని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న హత్య కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తున్నప్పటికీ సూత్రధారులను మాత్రం అదుపులోకి తీసుకోలేక పోతున్నరని విమర్శించారు. నేరస్థులు నిర్భయంగా ఎలా హత్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు.

ఢిల్లీలోని వ్యాపారస్థులకు బెదిరింపులు

ఇకపోతే, గతకొద్ది రోజులుగా ఢిల్లీలోని వ్యాపారస్థులకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. దీని వల్ల వారు ఢిల్లీని వదిలి, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని అన్నారు. ఢిల్లీలో వ్యాపారులకు, మహిళలకు, ప్రజలకు భద్రత కల్పించడంతో పోలీసులు కూడా విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడి ఓటర్లు పాఠశాలలు, ఆస్పత్రులను చక్కదిద్దే బాధ్యతను మాకు (ఆప్‌ ప్రభుత్వం) అప్పగించారు. బీజేపీకి (BJP) వారు ఇచ్చిన ఏకైక బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమే. అది కూడా కేంద్రం సరిగ్గా నిర్వహించలేకపోతోంది’’ అని కేజ్రీవాల్‌ అసహనం వ్యక్తం చేశారు.

Next Story