- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెనిజులా అధ్యక్షున్ని అరెస్టు చేసిన అమెరికా సీక్రెట్ ఆర్మీ.. "డెల్టా ఫోర్స్"
అమెరికా సీక్రెట్ ఆర్మీ "డెల్టా ఫోర్స్" కథేంటీ?

దిశ, వెబ్ డెస్క్ : నేడు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతోపాటు ఆయన భార్యను అమెరికా సైన్యం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిని అరెస్ట్ చేసింది అమెరికాలోని సాధారణ సైన్యం కాదు. అగ్రరాజ్యపు సీక్రెట్ ఆర్మీ అయిన "డెల్టా ఫోర్స్" అనే ప్రత్యేక టీమ్. ఈ సీక్రెట్ ఫోర్స్ ఎవ్వరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా టార్గెట్ పూర్తి చేయడంలో దిట్ట. ఇప్పటివరకు జరిపిన అన్ని ఆపరేషన్లలో డెల్టా ఫోర్స్ విజయం సాధించింది. మరి అమెరికా సీక్రెట్ ఆర్మీ డెల్టా ఫోర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డెల్టా ఫోర్స్ అంటే...
డెల్టా ఫోర్స్ అనేది అమెరికా ఆర్మీలో ఉన్న అత్యంత ప్రత్యేకమైన, అత్యంత రహస్యమైన సైనిక టీమ్ అని చెప్పవచ్చు. ఈ బృందాన్ని సాధారణ యుద్ధాల కోసం ఉపయోగించరు. కొన్ని ప్రత్యేక రిస్కుతో కూడిన ఆపరేషన్లలో మాత్రమే ఉపయోగిస్తారు. సాధారణ సైనికులు చేయలేని పనులను డెల్టా ఫోర్స్ చేస్తుంది. వీరి పనులు ఎక్కువగా రహస్యంగా ఉంటాయి కాబట్టి, వీరి గురించి పూర్తి వివరాలు ప్రజలకు బయటికి రావు. దేశ భద్రతకు పెద్ద ముప్పు వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ముందుగా రంగంలోకి దిగేది ఈ బృందమే. అందుకే డెల్టా ఫోర్స్‌ను అమెరికా ఆర్మీలో అత్యంత శక్తివంతమైన బృందంగా భావిస్తారు.
విధులేంటీ?
డెల్టా ఫోర్స్ ప్రధానంగా ఉగ్రవాదులపై నిఘా పెట్టడం, వారిపై ఆకస్మిక దాడులకు దిగి మట్టు పెట్టడం వంటివి చేస్తుంది. అంతేకాదు ఉగ్రవాదులు ఎవరినైనా బందీగా పట్టుకుంటే, వారిని సురక్షితంగా విడిపించడం కూడా వీరి ముఖ్యమైన పని. అలాగే దేశానికి పెద్ద ప్రమాదం కలిగించే ఉగ్రవాద నేతలను పట్టుకోవడం మరో ముఖ్య బాధ్యత. ఈ బృందం అమెరికా లోపల మాత్రమే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా పని చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. వీరి ఆపరేషన్లు చాలా వేగంగా, సైలెంట్ గా జరుగుతాయి. చాలా సార్లు ఆపరేషన్ జరిగిన విషయం కూడా ప్రజలకు తెలియదు.
ఎప్పుడు మొదలైంది?
అయితే ఈ డెల్టా ఫోర్స్‌ను 1977 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీనిని 'చార్లీ బెక్విథ్' అనే అమెరికా ఆర్మీ అధికారి ప్రారంభించాడు. బ్రిటన్‌లో ఉన్న ప్రత్యేక సైనిక బృందమైన SAS నుంచి ప్రేరణ తీసుకుని డెల్టా ఫోర్స్‌ను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద ముప్పు పెరుగుతున్న సమయంలో, అమెరికాకు ఒక అత్యంత శక్తివంతమైన ప్రత్యేక బృందం అవసరం అని భావించి దీనిని ఏర్పాటు చేశారు.
కఠోర శిక్షణ..
కాని డెల్టా ఫోర్స్‌లో చేరడం చాలా కష్టం అని అంటుంటారు. అమెరికా ఆర్మీలో ఇప్పటికే మంచి అనుభవం ఉన్న సైనికుల నుంచే ఎంపిక చేస్తారు. వారికి చాలా కఠినమైన పరీక్షలు పెడతారు. ఎక్కువ దూరం నడవడం, శారీరక బలం, మానసిక ధైర్యం, ఒత్తిడిని తట్టుకునే శక్తి వంటి అంశాల్లో కఠోర సాధన చేయిస్తారు. ఈ పరీక్షల్లో ఎక్కువ మంది విఫలమవుతారు. చాలా కొద్దిమంది మాత్రమే ఎంపిక అవుతారు. ఎంపికైన తర్వాత వారికి మరింత కఠినమైన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శత్రువును తక్కువ సమయంలో ఎలా ఎదుర్కోవాలి, భవనాల్లోకి ఎలా ప్రవేశించాలి, ఆధునిక ఆయుధాలను ఎలా ఉపయోగించాలి, కదలికలు రహస్యంగా ఎలా ఉండాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు.
సాధించిన విజయాలు..
డెల్టా ఫోర్స్ చేసిన కొన్ని ఆపరేషన్లు మాత్రమే ప్రజలకు తెలిసాయి. వాటిలో 1989లో పనామా దేశంలో ఒక అమెరికన్ డాక్టర్‌ను బందీగా పట్టుకున్నారు. అప్పుడు డెల్టా ఫోర్స్ అక్కడికి వెళ్లి, చాలా తక్కువ సమయంలో ఆ డాక్టర్‌ను సురక్షితంగా విడుదల చేసింది. ఈ ఆపరేషన్‌ను "ఆపరేషన్ ఆసిడ్ గ్యాంబిట్" (Operation Acid Gambit) అని పిలుస్తారు. ఇది డెల్టా ఫోర్స్ సాధించిన మొదటి పెద్ద విజయంగా గుర్తింపు పొందింది.
అలాగే ఇరాక్ లో సద్దాం హుస్సేన్ ను, ఆఫ్గానిస్తాన్ తో యుద్ధాల సమయంలో బిన్ లాడెన్ ను పట్టుకోవడంలో డెల్టా ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. అల్-ఖైదా, తాలిబాన్ వంటి ఉగ్రవాద సంస్థలపై రహస్యంగా దాడులు చేసి, అనేక మంది ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకుంది. 2015లో ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులు ఒక జైలులో వందల మందిని బందీగా పెట్టారు. డెల్టా ఫోర్స్ ఆ జైలుపై దాడి చేసి, అనేక మంది బందీలను సురక్షితంగా విడుదల చేసింది. ఈ ఆపరేషన్‌లో ఒక అమెరికన్ సైనికుడు ప్రాణాలు కోల్పోయినా, చాలా మంది రక్షించబడ్డారు. ఇది డెల్టా ఫోర్స్ చేసిన ఒక గొప్ప హ్యుమానిటీ ఆపరేషన్‌గా గుర్తించబడింది.
2019లో ఐసిస్ నాయకుడు అబూ బకర్ అల్-బగ్దాదీని పట్టుకునేందుకు జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో కూడా డెల్టా ఫోర్స్ కీలకంగా పనిచేసింది. ఈ ఆపరేషన్‌తో ఐసిస్ సంస్థకు పెద్ద దెబ్బ పడింది. డెల్టా ఫోర్స్ అనేక సందర్భాల్లో అమెరికన్ దౌత్యవేత్తలు, ముఖ్య అధికారులు ప్రమాదంలో ఉన్నప్పుడు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఈ ఆపరేషన్లు చాలా వేగంగా, ఎలాంటి హడావుడి లేకుండా జరిగాయి. చాలాసార్లు ప్రజలకు అసలు విషయం కూడా తెలియలేదు. ఇదే ఈ బృందం ప్రత్యేకత.






