- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ తర్వాతి టార్గెట్ ఇరాన్.. అమెరికన్ ఆర్థికవేత్త హెచ్చరిక
ట్రంప్ తర్వాతి టార్గెట్ ఇరాన్ అని, అది పెద్ద చిచ్చుగా మారే అవకాశం ఉందని అమెరికన్ ఆర్థికవేత్త హెచ్చరించారు.

దిశ, నేషనల్ బ్యూరో: మిలిటరీ చర్యతో వెనిజులా అధ్యక్షుడిని బంధించి, ప్రపంచానికి షాకిచ్చిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తర్వాత ఇరాన్‌నే టార్గెట్ చేస్తారా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ అమెరికన్ ఎకనామిస్ట్ జెఫ్రీ సాచ్స్. అంతర్జాతీయంగా నిబంధనల ఆధారంగా నడిచే ఒక విధానం ఉందని అనుకోవడమే ఒక కట్టుకథ అని ఆయన అభిప్రాయపడ్డారు. వెనిజులా అంశంపై యూఎన్ భద్రతా మండలిలో మాట్లాడిన అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2017లోనే లాటిన్ అమెరికా దేశాధినేతలతో జరిగిన సమావేశంలో వెనిజులాను ఆక్రమిస్తానని ట్రంప్ అన్నారని, కానీ ఆ దేశాధినేతలు మాట్లాడి ఆయనకు సర్దిచెప్పారని జెఫ్రీ చెప్పారు. ఇప్పుడు కనీసం యూఎస్ చట్టసభకు కూడా చెప్పకుండా ఆ దేశంపై సైనిక చర్య చేపట్టి, మిగతా లాటిన్ అమెరికా దేశాలకు వార్నింగులు ఇవ్వడం శోచనీయమన్నారు.
అలాగే కొత్త సంవత్సరం ఆరంభంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ట్రంప్ తన మార్-ఎ-లాగోలో కలిసిన తర్వాత.. తమ తదుపరి టార్గెట్ ఇరాన్ అనే సిగ్నల్స్ ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌లో నిరసనకారులపై కాల్పులు జరిపితే తాము రంగంలోకి దిగుతామని ట్రంప్ హెచ్చరించడం పైకి చెప్పే కారణమేనన్నారు. ఇరాన్ ప్రజలను కాపాడేందుకు మిలిటరీతో దిగామనే కారణం చూపించి, ఆ దేశంలో సైనిక చర్య చేపట్టేందుకు యూఎస్ ప్రయత్నిస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే వెనిజులా దేశం.. అమెరికాకు దగ్గరగా ఉండటంతో చైనా, రష్యా తదితర దేశాలు అక్కడి వరకు వచ్చి యూఎస్‌తో పోరాడేందుకు ఇష్టపడలేదని, కానీ ఇరాన్ ఆ దేశాలకే దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ దేశాలు కచ్చితంగా జోక్యం చేసుకుంటాయని జెఫ్రీ వివరించారు.
దానికితోడు ఇరాన్ వద్ద కూడా భారీ ఆయుధాలున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కనుక యూఎస్ ఆ దేశంపై దాడి చేస్తే అంతర్జాతీయంగా పెద్ద చిచ్చురేపినట్లేనని పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగానికి ట్రంప్ విలువనివ్వడం లేదని, యూఎస్‌లో నిజంగా రాజ్యాంగం అనేది ఉంటే.. వెనిజులా అధ్యక్షుడిని బంధించిన కేసులో ట్రంప్ ప్రభుత్వాన్ని కూడా కోర్టులు తప్పుబట్టాలని సూచించారు.






