అమెరికా ‘ప్రతీకార’ దాడులు.. ఆపరేషన్ హాకీ స్ట్రైక్‌తో ఐసిస్ స్థావరాలు ధ్వంసం!

by Malleboina Mahesh |

సిరియాలో అమెరికా దళాలపై జరిగిన దాడికి అగ్రరాజ్యం అత్యంత శక్తివంతమైన ప్రతీకారం తీర్చుకుంది.

అమెరికా ‘ప్రతీకార’ దాడులు.. ఆపరేషన్ హాకీ స్ట్రైక్‌తో ఐసిస్ స్థావరాలు ధ్వంసం!
X

దిశ, వెబ్ డెస్క్: సిరియాలో అమెరికా దళాలపై జరిగిన దాడికి అగ్రరాజ్యం అత్యంత శక్తివంతమైన ప్రతీకారం తీర్చుకుంది. ఈ నెల 13న పాల్మైరా నగరంలో ఐసిస్ జరిపిన మెరుపు దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులు, ఒక సివిలియన్ ఇంటర్‌ప్రెటర్ (అనువాదకుడు) మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రూరమైన చర్యకు సమాధానంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు పెంటగాన్ ‘ఆపరేషన్ హాకీ స్ట్రైక్’ (Operation Hawkeye Strike) పేరుతో భారీ వైమానిక దాడులను ప్రారంభించింది. సెంట్రల్ సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలు, ఆయుధ డిపోలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఎఫ్-15 జెట్‌లు, ఎ-10 థండర్‌బోల్ట్ విమానాలు, అపాచీ హెలికాప్టర్లతో దాదాపు 70కి పైగా చోట్ల బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడులకు జోర్డాన్ వైమానిక దళం కూడా సహకరించినట్లు సమాచారం.

ఈ ఆపరేషన్ గురించి పెంటగాన్ చీఫ్ (యుద్ధ కార్యదర్శి) పీట్ హెగ్సెత్ స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "ఇది యుద్ధానికి ఆరంభం కాదు. ఇది ఒక ప్రతీకార ప్రకటన" అని ఆయన అభివర్ణించారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే, వారు తమ జీవితాంతం భయం భయంగా గడపాల్సి వస్తుందని, అమెరికా వారిని వేటాడి మరీ అంతం చేస్తుందని హెచ్చరించారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. సిరియాలోని కొత్త ప్రభుత్వం కూడా ఈ దాడులకు పూర్తి మద్దతు తెలిపిందని, ఐసిస్ మూలాలను తుడిచిపెట్టే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేసింది.

Next Story