నీట్‌ యూజీ-2026 అవకతవకల ఆరోపణలు.. స్పందించిన NTA

by Kema Shiva Kumar |

నీట్ (యూజీ)-2026 పరీక్షలో అవకతవకల ఆరోపణలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పందించింది.

నీట్‌ యూజీ-2026 అవకతవకల ఆరోపణలు.. స్పందించిన NTA
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్‌ (యూజీ)-2026 పరీక్షలో జరిగినట్లుగా చెబుతున్న అవకతవకలపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) చేపట్టిన చర్యల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో అభ్యర్థులు, తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని స్పష్టతనిచ్చింది. దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించిన నీట్‌ (యూజీ)-2026 పరీక్షను పూర్తి భద్రతా ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించినట్లుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. నీట్ పరీక్ష షెడ్యూల్ ప్రకారం, పూర్తి భద్రతా ప్రమాణాలతో నిర్వహించామని ఎన్టీఏ తెలిపింది. ప్రశ్నాపత్రాలను జీపీఎస్ ట్రాకింగ్ ఉన్న వాహనాల్లో తరలించామని, పరీక్షా కేంద్రాల్లో ఏఐ ఆధారిత సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్ వెరిఫికేషన్, 5జీ జామర్లను వినియోగించినట్లు పేర్కొంది. పరీక్ష ముగిసిన నాలుగు రోజుల తర్వాత, అంటే మే 7వ తేదీ సాయంత్రం కొన్ని అక్రమాలు జరిగినట్లు సమాచారం అందడంతో, వాటిని మే 8న కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించినట్లు ఎన్టీఏ వివరించింది.

ప్రస్తుతం మీడియాలో వస్తున్న అరెస్టులు, అదుపులోకి తీసుకోవడం వంటివి దర్యాప్తు సంస్థల వృత్తిపరమైన పనితీరు వల్ల సాధ్యమైందని, వారికి అవసరమైన సాంకేతిక సహకారం, డేటాను అందిస్తున్నామని తెలిపింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, దీనిపై తాము ముందస్తుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోమని ఎన్టీఏ స్పష్టం చేసింది. నిజాయితీగా పరీక్ష రాసిన అత్యధిక శాతం అభ్యర్థుల శ్రమ వృధా కాదని, వారి ప్రయోజనాలను దెబ్బతీయబోమని హామీ ఇచ్చింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా దర్యాప్తు పూర్తయ్యే వరకు సహనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000/ 011-69227700 నంబర్లు లేదా [email protected] ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించింది.

Next Story