Bengaluru rains: నీట మునిగిన బెంగళూరు! వర్షాలతో రోడ్లన్నీ జలమయం.. ప్రజల అవస్థలు

by Ramesh Naini |

కర్ణాటకలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో బెంగళూరు మహానగరం వరదతో నీట మునిగిపోయింది.

Bengaluru rains: నీట మునిగిన బెంగళూరు! వర్షాలతో రోడ్లన్నీ జలమయం.. ప్రజల అవస్థలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Bengaluru rains) కర్ణాటకలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో బెంగళూరు మహానగరం వరదతో నీట మునిగిపోయింది. నిన్న ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో సోమవారం తెల్లవారు జామున బెంగళూరులో ప్రయాణికులకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జలమయమైన రోడ్లు స్వాగతం పలికాయి. నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా హోరామావులోని శ్రీ సాయి లేఅవుట్, రెయిన్‌బో డ్రైవ్ వంటి లేఅవుట్‌లు వరదల్లో చిక్కుకున్నాయి. సాయి లేఅవుట్ వద్ద ఇళ్లలోని నీటిని తొలగించడానికి నివాసితులు ఇబ్బంది పడుతున్నారు. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డ్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఐఎండీ డేటా ప్రకారం.. బెంగళూరు నగరంలో గత 24 గంటల్లో 105.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈ సీజన్‌లో ఇదే అతి పెద్ద వర్షపాతం నమోదుగా భావిస్తున్నారు.

ట్రాఫిక్‌ క్లియర్ చేయడానికి ప్రోటోకాల్

ట్రాఫిక్‌ క్లియర్ చేయడానికి అధికారులు ప్రోటోకాల్ జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి దక్షిణ డివిజన్ ట్రాఫిక్ పోలీసులకు ఒక ప్రోటోకాల్ జారీ చేశారు. నీటిని బయటకు పంపడానికి మోటార్లను అమర్చాలని, అవసరమైన చోట ట్రాఫిక్‌ను నియంత్రణకు మరింత మంది బలగాలను మోహరించాలని ప్రోటోకాల్ పోలీసులను ఆదేశించింది. ప్రధాన రహదారి నుంచి ప్రక్కనే ఉన్న రోడ్లకు ట్రాఫిక్‌ను మళ్లించాలని, అవసరమైనప్పుడల్లా ఫ్లైఓవర్‌లపై వాహనాలు తిరగకుండా ఆపాలని ప్రోటోకాల్లో పేర్కొన్నారు. ఆఫ్-రోడింగ్ ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వెల్లడించడానికి ప్రసారం చేయడానికి రోడ్ ఈజీ యాప్, గూగుల్ మ్యాప్స్, ఎఫ్ఎం రేడియోలను ఉపయోగించుకోవాలని అధికారులు ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోనిక్ సర్క్యులేషన్ (Cyclonic circulation) కారణంగా గత రెండు రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి.

Next Story