లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు

by Yella Dhawani Reddy |

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon Session) జులై 21న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ, చర్చలు జరుగకుండానే గత ఐదు రోజులుగా విపక్షాల నిరసనలతో సభలో గందరగోళం నెలకొని సభా కార్యకలాపాలు సజావుగా సాగటం లేదు. దీంతో అసలు చర్చలకు మార్గం లేకుండా, రెండు సభల్లోనూ తరచూ వాయిదాల జోరు కొనసాగుతోంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ (SIR), పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు కేంద్రాన్ని ఎండగడుతూ చర్చలు జరగకుండానే సభలు ప్రతిరోజూ అర్ధంతరంగా వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సభా పనితీరును పునరుద్ధరించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ( Lok Sabha Speaker Om Birla) శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు తన ఛాంబర్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. సభా కార్యకలాపాలు నియమాల ప్రకారం సాగాలని, చర్చలకు అవకాశం ఉంటుందని స్పీకర్ హామీ ఇచ్చారు. ఇక మరోవైపు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఆయన పార్లమెంట్ కార్యాలయంలో కలిశారు. సభ గౌరవాన్ని కాపాడుతూ ప్రశాంతంగా సమావేశాలు నడిపేందుకు ఆయన చర్చలు జరిపారు. ఈ భేటీలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. రిజిజు వెంట కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ ఉన్నారు. కాగా, ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌పై జులై 28న 16 గంటల ప్రత్యేక చర్చకు అంగీకరించింది. అయినప్పటికీ, బీహార్ ఓటర్ల జాబితా సవరణ, ట్రంప్ వ్యాఖ్యలపై చర్చకు స్పష్టత లేకపోవడంతో సభలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

Next Story