జేడీ వాన్స్‌ను కలిసిన శశిథరూర్ దౌత్యబృందం

by Phanindra |

యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను శశిథరూర్ నేతృత్వంలోని దౌత్యబృందం కలిసింది. ఉగ్రవాదంపై పోరు సహా కీలక అంశాలపై చర్చించినట్లు థరూర్ తెలిపారు.

జేడీ వాన్స్‌ను కలిసిన శశిథరూర్ దౌత్యబృందం
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ కీలక నేత శశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్యబృందం ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఉంది. ఇక్కడ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఈ బృందం కలిసింది. ఈ విషయాన్ని వాషింగ్టన్‌లో భారత ఎంబసీ వెల్లడించింది. ‘యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను శశిథరూన్ నేతృత్వంలోని దౌత్యబృందం కలిసింది. భారత్-యూఎస్ బంధాలను బలోపేతం చేయడం, ఉగ్రవాద వ్యతిరేక అంశాల్లో సహకారం తదితర అంశాలపై చర్చలు జరిగాయి’ అని ఎంబసీ వెల్లడించింది. తాము ఎన్నో అంశాల గురించి చర్చలు జరిపామని శశిథరూర్ కూడా చెప్పారు. ‘వాషింగ్టన్‌లో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో మా దౌత్యబృందం సమావేశం అద్భుతంగా జరిగింది. ఎన్నో కీలక అంశాలపై మేం చర్చించాం. సాంకేతిక సహకారం నుంచి కౌంటర్ టెర్రరిజం చర్యల వరకు పలు అంశాలపై చర్చలు జరిపాం. భారత్, యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే విషయంలో చాలా ఉపయోగకరమైన చర్చ జరిగింది’ అని థరూర్ చెప్పుకొచ్చారు. కాగా, ఏప్రిల్ 22న పహెల్గాం ఉగ్రదాడి జరిగిన సమయంలో జేడీ వాన్స్.. భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

Next Story