పొల్లాచి లైంగిక వేధింపుల కేసు.. 9 మంది దోషులుగా నిర్థారణ

by Naga Rani Yarlagadda |

2019 పొల్లాచి లైంగిక వేధింపుల కేసులో (Pollachi Assault Case) కోయంబత్తూరు సెషన్స్ కోర్టు (Coimbatore Sessions Court) 9 మందిని దోషులుగా తేల్చింది.

పొల్లాచి లైంగిక వేధింపుల కేసు.. 9 మంది దోషులుగా నిర్థారణ
X

దిశ, వెబ్‌డెస్క్: 2019 పొల్లాచి లైంగిక వేధింపుల కేసులో (Pollachi Assault Case) కోయంబత్తూరు సెషన్స్ కోర్టు (Coimbatore Sessions Court) 9 మందిని దోషులుగా తేల్చింది. 2019లో సంచలనం సృష్టించిన ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న 9 మంది నిందితులు శబరిరాజన్ అలియాస్ రిష్వంత్ (32), తిరునావుకరసు(34), టి వసంత కుమార్ (30), ఎం సతీష్ (33), ఆర్. మణి అలియాస్ మణివణ్ణన్, పి బాబు (33), హరోన్ పాల్ (32), అరుళానందం (39), అరుణ్ కుమార్ (33)లను కోర్టు దోషులుగా ప్రకటించింది.

తమిళనాడులోని (Tamilnadu) పొల్లాచిలో అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఈ 9 మంది దోషులకు జీవితఖైదు విధించాలని ప్రాసిక్యూషన్ న్యాయస్థానాన్ని కోరింది. మంగళవారం మధ్యాహ్నానికి ఈ కేసులో తుది తీర్పు వెలువడనుంది. వీరంతా ఒక కాలేజీ విద్యార్థినితో పాటు మరో 9 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి, వారిని నగదు కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో రుజువైంది. 2016 -2018 మధ్యలో ఈ నేరాలు జరిగాయని, ఒకే బాధితురాలిపై పదే పదే అత్యాచారం, నేరపూరిత కుట్ర, లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ వంటి వాటి కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి. తొలుత ఈ కేసును తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CB-CID) దర్యాప్తు చేసింది. ఆ తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కు కేసును బదిలీ చేశారు.

అసలేంటి ఈ కేసు?

2019 ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో, ఒక గ్యాంగ్ అనేక మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి, వాటిని మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. నిందితులు రికార్డింగ్‌లను ఉపయోగించి బాధితుల నుండి నగదు దోచుకుని మరింత హింసకు పాల్పడినట్లు తెలిసింది. నిందితుల్లో శబరిరాజన్, తిరునావుకరసు, సతీష్, వసంతకుమార్, బాబు, మణి, కె. అరుళనంతం, హెరాన్ పాల్, బాలు ఉన్నారు. వీరిలో కొందరికి అప్పటి అధికార పార్టీ AIADMKతో సంబంధం ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

రాజకీయ ఒత్తిడి, కేసు తీవ్రత కారణంగా ఈ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి బదిలీ అయింది. CBI 2019 ఏప్రిల్‌లో రెండు FIRలు నమోదు చేసి, 2021లో మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ కేసు తమిళనాడులో రాజకీయంగా సున్నితమైన అంశంగా మారడంతో పాటు, మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. 2025 ఏప్రిల్‌లో విచారణ పూర్తి కాగా నేడు దోషులకు శిక్ష పడనుంది. ఈ తీర్పు లైంగిక వేధింపుల బాధితులకు న్యాయం అందించడంలో ఒక మైలురాయిగా నిలిచిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Next Story