భారత్‌లో జరిగి ఉంటే.. డబ్ల్యూటీసీపై మండిపడ్డ చోప్రా

by Phanindra |   (  Updated:2025-06-13 14:39:32  IST  )

డబ్ల్యూటీసీపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మండిపడ్డాడు. రెండ్రోజుల్లో 28 వికెట్లు భారత్‌లో పడి ఉంటే విమర్శలు వెల్లువెత్తేయన్నాడు.

భారత్‌లో జరిగి ఉంటే.. డబ్ల్యూటీసీపై మండిపడ్డ చోప్రా
X

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్‌పై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మండిపడ్డాడు. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రెండ్రోజుల్లోనే 28 వికెట్లు పడ్డాయి. అయినా సరే విదేశీ మీడియా దీనిపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తడంలేదని చోప్రా విమర్శించారు. అదే భారత్‌లో ఇలా జరిగుంటే టెస్టు క్రికెట్ చంపేస్తున్నారంటూ విమర్శలు చేసేవారన్నాడు. ‘ఇండియాలో కనుక రెండ్రోజుల ఆటలో 28 వికెట్లు పడి ఉంటే.. పాశ్చాత్య మీడియా గుండెలు బాదుకునేది. పిచ్‌లు టర్న్ అవుతున్నాయని, బౌన్స్ ఉందని, బ్యాటింగ్ చాలా కష్టంగా మారిందని.. రకరకాల కారణాలు చెప్పేవాళ్లు. పిచ్‌లు ఎలా ఉండాలో సలహాలిచ్చేవాళ్లు. పిచ్‌లను ఇలా తయారుచేసి, టెస్టు క్రికెట్‌ను భారత్ చంపేస్తుందని విమర్శించేవారు కదా’ అని చోప్రా నిలదీశాడు.

ఇదే భారత్‌లో జరిగి ఉంటే ‘ది టెలిగ్రాఫ్’, ‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ వంటి పత్రికలన్నీ భారత్‌పై పడి ఏడ్చేవని ఆయన చెప్పాడు. భారత్ చేసింది తప్పనే ఫీలింగ్ కలిగించేందుకు ఈ పత్రికలు ప్రయత్నించేవన్నాడు. ‘ఈ పని ఇంగ్లండ్‌లో జరిగింది కాబట్టి ఇప్పుడిది స్పోర్టింగ్ పిచ్ అయిపోయింది. బ్యాటర్ల డిఫెన్సివ్ టెక్నిక్‌ను పరీక్షించే అద్భుతమైన పిచ్ అంటున్నారు. అప్పుడు భారత్‌లో అయినా బ్యాటర్ల డిఫెన్సివ్ టెక్నిక్‌ను పరీక్షించడమే అవుతుంది కదా’ అని చోప్రా ఆగ్రహం వ్యక్తంచేశాడు.

Next Story